పుష్కరాలకు ప్రణాళిక రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ప్రణాళిక రూపొందించాలి

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రాచలం వంతెన నుంచి ఆలయం వరకు సుమారు రూ.14 కోట్లతో, బండ్‌ నుంచి ఆలయం వైపు సుమారు రూ.2.60 కోట్లతో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు వసతి, భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రదేశాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఐటీసీ వంటి సంస్థల సీఎస్సార్‌ నిధులను కూడా వినియోగించుకోవాలన్నారు. మరమ్మతులు, కొత్త ఘాట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, బూర్గంపాడు మండలం మోతె వద్ద వీఐపీ ఘాట్‌ ప్రతిపాదనలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరు, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పార్కింగ్‌ స్థలాలు, హోల్డింగ్‌ ఏరియాలను గుర్తించాలన్నారు. సారపాకలోని పుష్కరవనం పరిధిలో ఉన్న సుమారు 75 ఎకరాల స్థలంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. అటవీ శాఖకు చెందిన యూకలిప్టస్‌ ప్లాంటేషన్‌, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ భూములను కూడా పరిశీలించాలని సూచించారు. రద్దీ నియంత్రణకు కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎస్పీ రోహిత్‌ రాజు మాట్లాడుతూ వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా వాహనాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా నిర్ధారించడంతోపాటు పార్కింగ్‌ స్థలాలు, హోల్డింగ్‌ ఏరియాలను గుర్తించి ట్రాఫిక్‌ నిర్వహణ చేపడతామన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, పార్కింగ్‌ ప్రాంతాల్లో సూచిక బోర్డులు, రేడియం, ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు. భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, డీపీఓ అనూష, సీపీఓ సునీత, దేవాదాయ శాఖ ఈఓ దామోదరరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement