అశ్వాపురం: భూగర్భ జలాలు అడుగంటకుండా వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి అనూష సూచించారు. గురువారం మండల పరిధిలోని కల్యాణపురం గ్రామపంచాయతీని ఆమె సందర్శించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 51 మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణాలకు మార్కింగ్ ఇవ్వగా, ఇంకుడు గుంతల నిర్మాణానికి డీపీఓ శంకుస్థాపన చేశారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో వివిధ రికార్డులను తనిఖీ చేసి వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ జల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఎంపీడీఓ ముత్యాలరావు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


