నేలకొండపల్లి: మరో 20నిమిషాల్లోగా ఇంటికి చేరతారగా జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడగా, చికిత్స పొందుతూ ఓ యువతి మృతి చెందింది. ఖమ్మంకు చెందిన సంగోజు నవ్య(27), దివ్య(24) బుధవారం కారు లో విజయవాడ వెళ్లి తిరిగి వస్తున్నారు. కోదాడ – ఖమ్మం జాతీయ రహదారిపై నేలకొండపల్లి మండలానికి చేరేసరికి అర్ధరాత్రి దాటింది. ఆచార్లగూడెం సమీపంలోని ప్‌లైఓవర్ వద్ద కారు డ్రైవర్ వేగంగా వెళ్తూ కోదాడ నుంచి ఖమ్మం వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. దీంతో రెండు వాహనాలు పల్టీ కొడుతూ హైవే పైనుంచి పక్కనే సర్వీస్ రోడ్డుపై పడ్డాయి. ఘటనలో కారులోని నవ్య, దివ్య, కారు డ్రైవర్ దుర్గాప్రసాద్‌తో పాటు ఆటోలో ఉన్న ఇద్దరికి బలమైన గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దివ్య గురువారం మృతి చెందింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆమె తండ్రి వెంకటాచారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంటికి వస్తుందని ఎదురుచూస్తున్న తమ కుమార్తె మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఐదుగురికి గాయాలు,
చికిత్స పొందుతున్న యువతి మృతి


