ఖమ్మం క్రైం / ఖమ్మం అర్బన్: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం.. నిత్యం పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునే కూలీని గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. ఖమ్మంలోని తెలంగాణ తల్లి సర్కిల్ వద్ద గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు గ్రామానికి చెందిన అన్నారపు భద్రయ్య(40) ఖమ్మం రమణగుట్టలో అత్తగారింట్లో నివాసముంటూ సుతారి పనులతో జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే గురువారం ఆయన తెలంగాణ సర్కిల్ వద్ద అడ్డాపైకి వచ్చాడు. అందరితో పాటు పని కోసం వేచి ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈమేరకు ఖమ్మం టూటౌన్ పోలీసులు చేరుకుని రెడ్‌క్రాస్ సభ్యుడు, అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని పెద్దాస్పత్రి మార్చురీకి తరలించారు. భద్రయ్య మృతితో భార్య, కుమార్తె, కుమారుడు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.
అడ్డా మీదే ఆగిన కార్మికుడి గుండె


