నేలవాలి మొలకెత్తి..
తుపాను ధాటికి దెబ్బతిన్న
ధాన్యం, పత్తి, మిర్చి
పరిహారం అందినా పెట్టుబడులు
పూడవని ఆవేదన
తడిసిన పంటలను ప్రభుత్వమే
కొనుగోలు చేయాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఈ వానాకాలంలో ఉమ్మడి ఖమ్మం రైతులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఎల్‌నినోతో కారణంగా సీజన్లో పంటలు అంతంత మాత్రంగానే సాగయ్యాయి. అరకొరగా సాగైన పంటలకు డిమాండ్ ఉందని సంతోషిస్తుండగానే తుపాన్లు ముంచేశాయి. ఉమ్మడి జిల్లాలో 34,231 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ పంటలకు పరిహారం ఇచ్చిన పెట్టుబడికి సైతం సరిపోనందున తడిసిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
సంతోషిస్తుండగానే..
వర్షాకాలం ప్రారంభం నుంచి ఎల్‌నినోతో వర్షాలు లేకపోగా ఎండలు పెరిగాయి. సీజన్ మొత్తంలో కేవలం సెప్టెంబర్‌లో రెండు రోజులపాటు కురిసిన వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. బోర్లు, బావులు, అడపా దడపా వచ్చిన గోదావరి జలాలతో రైతులు కష్టాలకోర్చి సాగు చేపట్టారు. ప్రస్తుతం కొన్నిచోట్ల వరి కోతలు ప్రారంభం కాగా.. పత్తి మొదటి తీత పూర్తయింది. ఇంకొన్ని చోట్ల వరికి చివరి తడులు అవసరం ఉండగా.. కోతలు కూడా చేపట్టాల్సి ఉంది. దిగుబడులు తక్కువగాఉండడం, యాసంగి పంటల సాగు ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో అరకొర పంటలకు డిమాండ్ పెరిగి మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి వ్యాపారులు కొనుగోళ్లు మొదలుపెట్టారు. దీంతో కనీసం పెట్టుబడులైనా దక్కుతాయని రైతులు ఆశపడ్డారు.
వరి వంగి.. పత్తి నాని..
రైతులు సంతోషంలో ఉండగానే ఉమ్మడి జిల్లాపై ఒకటి వెంట ఇంకొకటి అన్నట్టు అర్నబ్, మురసు తుపాన్లు పంటలను ఊడ్చేశాయి. కోత దశలో ఉన్న వరితో పాటు తుది దశకు చేరిన పత్తి, మిర్చి పంటలు వర్షాలకు తడిసిముద్దయ్యాయి. చేలన్నీ చెరువులను తలపిస్తుండగా కోసిన ధాన్యం నానిపోయింది. అలాగే, వరి కంకులు నేలవాలి మొలకెత్తుతున్నాయి. ఈ వరిని కోసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇక పత్తి తడిసిపోవడంతో కాయల నుంచి కిందకు పడిపోతోంది. పత్తి కాయలు కుళ్లిపోతున్నాయని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మొక్కజొన్నల పరిస్థితి కూడా అలాగే ఉండడంతో రహదారులపై ఆరబోస్తున్నారు.
34 వేల ఎకరాలకు పైగా..
తుపాన్ల ధాటికి నష్టపోయిన పంటలపై వ్యవసాయాఽధికారులు అంచనాల తయారీలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 34,231 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఖమ్మం జిల్లాలో 23,140 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11,091 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అంచనా. రెండు, మూడు రోజుల్లో అధికారులు పూర్తిస్థాయిలో నష్టం అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. తుది అంచనాల నాటికి ఉమ్మడి జిల్లాలో నష్టం 50 వేల ఎకరాలు దాటొచ్చని భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం పరిహారం ఇచ్చినా పెట్టుబడుల్లో సగం కూడా రాదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమాన తుపాన్ల కారణంగా తడిసిన వరి, పత్తితో పాటు మిర్చి, మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం, పత్తికి సంబంధించి సీసీఐ కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. తక్షణమే ఈ కేంద్రాలను తెరిచి నిబంధనలను సడలించి పంటలను కొనుగోలు చేయాలనే డిమాండ్ వస్తోంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమలాపురానికి చెందిన మాలోత్ వెంకటేశ్వరరావు రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఎకరానికి రూ.30 వేల చొప్పున పెట్టుబడి పెట్టగా ఇటీవల తుపాన్‌తో పంట నేలమట్టమైంది. వరి కంకులన్నీ నేలవాలి మొలకెత్తాయి. శనివారం ఎకరంన్నర వరిని మిషన్‌తో కోయడానికి దాదాపు 10 గంటలు పట్టడంతో రూ.35 వేలు ఖర్చయ్యాయి. ఇటు దిగుబడి తగ్గి, అటు పెట్టుబడులు పెరగడంతో మిగిలేదేమీ ఉండదని వాపోతున్నాడు.
పంటల నష్టంపై సమగ్ర సర్వే
ఖమ్మంవ్యవసాయం: మురసు తుపాన్‌తో జిల్లాలో జరిగిన పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు శనివారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే మొదలుపెట్టారు. ఈనెల 2, 3వ తేదీల్లో మురసు తుపాను ఉమ్మడి జిల్లాలో బీభత్సం సృష్టించగా, చేతికందే దశలో ఉన్న వరి, పత్తి పంటలతో పాటు మిర్చి, కూరగాయల పంటలు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 23,140 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలోని 11,091 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని ప్రాథమిక గుర్తించారు. ఈక్రమాన ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నిబంధనల మేరకు 33 శాతం నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని సర్వే చేయాలని ఆదేశించడంతో ఏఈఓలు రంగంలోకి దిగారు. రైతు భరోసా క్రాప్ డ్యామేజ్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులపై సర్వే కొనసాగుతోంది. ఈనెల 10వ తేదీ నాటికి కరువు మండలాల్లో పంటల పరిస్థితిపై నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇక 11వ తేదీ నాటికి తుపాన్‌తో ఎదురైన నష్టంపై కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఖమ్మం డీఏఓ పుల్లయ్య తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 34వేల
ఎకరాలకు పైగా పంటల నష్టం


