● ప్రేమ పెళ్లి.. ఆపై రెండో భర్తగా కొనసాగడంపై అయిష్టత ● భార్యను హతమార్చి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన కానిస్టేబుల్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెంఅర్బన్: ఆమెకు అప్పటికే వివాహం జరిగి ఓ కుమారుడు ఉండగా, భర్త మృతి చెందాడు. ఆ తర్వాత ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన కానిస్టేబుల్ ప్రేమించానని వెంటబడగా ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. అయినా అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్న ఆయన గొడవ పడుతూ చివరికి హతమార్చాడు. ఈమేరకు వివరాలను ఎస్పీ రోహిత్‌రాజ్ కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో శనివారం వివరాలు వెల్లడించారు.
ఇన్‌స్టాలో పరిచయం, రెండో పెళ్లి
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన భవానీ (30) కి వివాహం జరిగి కుమారుడు జన్మించాక భర్త మృతి చెందాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలు పోస్ట్ చేసే ఆమెకు భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం గోలియాతండాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బోడా నరేందర్ పరిచయమయ్యాడు. ప్రేమించానని వెంటపడిన ఆయన వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు అడ్డు చెప్పినా రెండేళ్ల క్రితం ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. భవానీకి మొదటి భర్తతో జన్మించిన కుమారుడు ఆమె సోదరి వద్ద ఉంటుండగా, కొత్తగూడెం ప్రగతినగర్‌లోని అద్దె ఇంట్లో నరేందర్ దంపతులు కాపురం పెట్టా రు. వీరికి తొలి సంతానంగా బిడ్డ జన్మించినా కొన్నాళ్లకే కన్నుమూసింది. ప్రస్తుతం భవానీ నాలుగు నెలల గర్భవతి. అయితే, పెళ్లయి రెండేళ్లు దాటినా కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు కొనసాగుతుండడం, భవానీకి రెండో భర్తగా కొనసాగడం ఇష్టం లేని నరేందర్ ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 3వ తేదీన రాత్రి ఇంట్లోనే ఆమెను హతమార్చాడు.
ఆనవాళ్లు దొరకొద్దని గోదావరిలో..
భవానీని హతమార్చాక మృతదేహాన్ని నరేందర్ తొలు త బైక్‌పై స్వగ్రామమైన గోలియాతండాకు తీసుకెళ్లాడు. అక్కడ పొలంలో మృతదేహాన్ని పెట్టి విషయాన్ని కుటుంబీకులకు చెప్పాడు. అనంతరం 4వ తేదీన రాత్రి 11 గంటలకు తండ్రి హరిలాల్ సాయంతో మృతదేహాన్ని తీసుకుని బైక్‌పైనే భద్రాచలం వెళ్లి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో వేశాడు. వరదలో కొట్టుకుపోతే ఆనవాళ్లు దొరకవనే భావనతో ఈ పనిచేసిన ఆయన ఇంటికి వచ్చేశాడు. ఈక్రమాన భవానీ కనిపించకపోవడం, నరేందర్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమె సోదరి గుండారపు స్వరూప 6వ తేదీన కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యా ప్తు మొదలుపెట్టారు. ఆమె ఫిర్యాదులో నరేందర్‌పై అనుమానాలు వ్యక్తం చేయగా ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో విషయం బయటపెట్టాడు. దీంతో భద్రాచలంవద్ద గోదావరిలో శుక్రవారం జాలర్ల సాయంతో గాలింపు చేపట్టగా చివరకు బూర్గంపాడు మండలం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఈమేరకు నరేందర్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కుతరలిం చనుండగా, నేరంలో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపా రు. కేసువిచారణలో కీలకంగా వ్యవహరించిన కొత్త గూడెం డీఎస్పీ ఆదినారాయణ, చుంచుపల్లి, త్రీటౌన్, వన్‌టౌన్ సీఐలు ఆర్.వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, అన్నపురెడ్డిపల్లి, త్రీటౌన్ ఎస్సైలు విజయ్ సింహారెడ్డి, రమేష్, సిబ్బందిని ఎస్పీఅభినందించారు.


