ఖమ్మం సహకారనగర్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందని వారు, విచారణకు గైర్హాజరైన వారే కాక నివాసం మారిన, రెండేసి చోట్ల ఓట్లు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కేటగిరీ కింద మొత్తం 1,32,785 మంది ఓటర్లు ఉండగా, అర్హులు 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని తెలిపారు. జాబితాలో పేరు ఉండి అదే చిరునామాలో నివసిస్తున్నవారు ఎన్యుమరేషన్ ఫారంతోపాటు అనుబంధం పత్రం సమర్పించాలని, మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్నవారు కొత్త చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని తెలిపారు. అయితే, ఇప్పటికే ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారు ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. తొలుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.
‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’
ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు దీపావళి సంబురాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ‘మా ఇంది రమ్మ ఇంట్లో దీపావళి సంబురాలు’లో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలో వసంత, ఉపేంద్ర, లీలావతి ఇళ్లకు శనివారం రాత్రి వెళ్లిన కలెక్టర్ అంకిత్.. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చారు. హౌసింగ్ పీడీ సవేరాం, ఎంపీడీఓ సుస్మిత తదితరులు పాల్గొన్నారు.
మరింత వేగంగా భూముల రీసర్వే
జూలూరుపాడు(సుజాతనగర్): భూవివాదాలను పరిష్కరించేలా చేపడుతున్న రీ సర్వే వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సుజాతనగర్ మండలం రాఘవాపురంలో సర్వేను శనివారం పరిశీలించిన ఆయన ఉద్యోగులతో చర్చించారు. గ్రామ పరిధిలో 1,800 ఎకరాల భూమిని సర్వే చేయించాల్సి ఉండగా, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ భూమి హద్దులు కచ్చితంగా గుర్తిస్తూనే యజమానుల వద్ద ఆధారాలు పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. తహసీల్దార్ కృష్ణప్రసాద్, సర్వేయర్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


