రెండు నెలల తర్వాత
కొత్తగూడెం కార్పొరేషన్లో భేటీ
అజెండాలోని 32 అంశాలపై చర్చ, ఆమోదం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాల సమావేశాలను నిర్దిష్టమైన గడువు లేకుండా నిర్వహిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. సమయానికి అనుగుణంగా సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు రెండు నెలల తర్వాత శనివారం మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అయితే, అజెండాలో 32 అంశాలను పొందుపర్చగా.. ఆ కాపీలను ముందుగా సభ్యులకు ఇచ్చారో, లేదో స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ హడావుడిగా 32 అంశాలపై చర్చించారు. ప్రధానంగా కాలిపోయిన ఎల్ఈడీ లైట్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి సాధారణ నిధుల రూ.10 లక్షల కేటాయింపు, ఎలక్ట్రికల్ పనులకు కావాల్సిన భద్రత కిట్లు, పరికరాల కొనుగోలుకు మరో రూ.3లక్షలు, దీపావళి సందర్భంగా శ్మశానవాటికల దగ్గర లైటింగ్ ఏర్పాటుకు రూ.1.50 లక్షలు, వీధి దీపాల నిర్వహణ సిబ్బంది నియామకానికి రూ.10లక్షలు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితకుమారి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొనగా.. సరైన చర్చ లేకుండానే అజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపారని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రామవరం సమస్యలపై వినతి
రుద్రంపూర్: రామవరం ప్రాంతంలో స్థిరాస్థి పేర్ల మార్పిడి, తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలంటూ 16వ డివిజన్ కార్పొటర్ మునిగడప పద్మ మేయర్ గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే, 18వ డివిజన్లో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని కార్పొరేటర్ హిమశ్రీ కోరారు. అంతేకాక వీధి దీపాల ఏర్పాటుపై దృష్టి సారించాలని వినతిపత్రం అందజేశారు.


