భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు.
సికింద్రాబాద్ వాసి భారీ విరాళం
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి సికింద్రాబాద్ వాసి మంగళవారం భారీ విరాళం సమర్పించారు. సికింద్రాబాద్‌లోని పీజీ రోడ్డుకు చెందిన కశ్యప్ రాజేష్ నిత్యాన్నదానానికి రూ.9 లక్షలు, శాశ్వత కల్యాణ నిమిత్తం రూ.75 వేలు, గోశాల నిర్వహణకు రూ.5,55,000ను ఆలయ అధికారులకు అందచేశాక స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగులు కత్తి శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, నిరంజన్, అనిల్ పాల్గొన్నారు.
రేక్ పాయింట్‌కు 1,319 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు ఆర్‌సీఎఫ్ కంపెనీకి చెందిన 1,319.22 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 519.22 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 500 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేసినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.
‘ఆయుష్’ పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: జాతీయ ఆయుష్ మిషన్ పథకంలో భాగంగా ఔట్ సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్(పీజీ) పోస్టు ఒకటి, మూడేసి మెడికల్ ఆఫీసర్, మల్టీపర్పస్ వర్కర్ పోస్టులతో పాటు డైటీషియన్, సైకో సోషల్ కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్ పోస్టు ఒక్కొక్కటి ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 2వరకు దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలు, వయోపరిమితి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు ఒక ప్రకటనలో సూచించారు.
బాణాసంచా విక్రయానికి దరఖాస్తు చేసుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రానున్న దీపావళి సందర్భంగా జిల్లాలో తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సూచించారు. అగ్నిమాపక శాఖ, ప్రైవేట్ స్థల యజమాని, ప్రభుత్వ స్థలమైన సంబంధిత అధికారి జారీ చేసిన ఎన్‌ఓసీ, జీఎస్‌టీ సర్టిఫికెట్ ఇతర పత్రాలతో నవంబర్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే, నిర్ణీత రుసుము చెల్లించిన బ్యాంకు చలాన్ కూడా సమర్పించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణాసంచా విక్రయిస్తే చర్యలు తీసుకోనున్నందున, విక్రయదారులు తప్పనిసరి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని ఎస్పీ ఓ ప్రకటనలో సూచించారు.
సీతంపేట బంజరకు జాతీయ స్థాయి అవార్డు !
జూలూరుపాడు(సుజాతనగర్): సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామపంచాయతీ జాతీయ స్థాయి అవార్డు దక్కే అవకాశముంది. తొమ్మిది విభాగాల్లో జీపీలకు అవార్డులు ఇవ్వనుండగా, పరిశుభ్రత, పచ్చదనం విభాగంలో రాష్ట్రం నుంచి సీతంపేట బంజర నామినేట్ అయింది. ఈమేరకు బుధవారం కేంద్ర బృందం సభ్యులు గ్రామంలో పరిశీలించనున్నారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, పచ్చద నం, ప్రజారోగ్యం, మహిళా సాధికారత, రికార్డుల నిర్వహణను ఈ బృందం పరిశీలించి ఇచ్చే నివేదిక ఆధారంగా అవార్డు ప్రకటించే అవకాశముంది. ఈనేపథ్యాన మంగళవారం సర్పంచ్ గుగులోత్ జానకీరామ్‌తో డీఆర్‌డీఓ విద్యాచందన, డీపీఓ అనూష గ్రామంలో పర్యటించారు. డీఎల్పీఓ ప్రభాకర్, ఎంపీడీఓ బి.భారతి, ఎంపీఓలు గాంధీ, తులిసీరామ్, కన్సల్టెంట్ రేవతి, ఏపీఓ రంగా, పంచాయతీ కార్యదర్శి నర్సింహారావు పాల్గొన్నారు.


