ఆరోగ్యానికి సవాళ్లు! | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి సవాళ్లు!

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలు, మధుమేహం, ఊబకాయం

చిన్నారుల పోషణలోనూ సమస్యలు

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్ల జోరు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6లో వెల్లడి

అవసరమైతేనే సిజేరియన్‌..

భద్రాచలంఅర్బన్‌: జిల్లాలో ఆరోగ్య సేవలు మెరుగుపడుతున్నా.. కొన్ని సమస్యలు ఆందోళన కలిగి స్తున్నాయి. బాల్య వివాహాలు ఎక్కువ అవుతుండడంతో పురుషుల్లో మధుమేహం, మహిళల్లో ఊబ కాయం పెరుగుతోంది. చిన్నారుల్లో ఎదుగుదల లోపం తగ్గినా తక్కువ బరువు సమస్య వెంటాడుతోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాల శాతం పెరగడం మరో ఆందోళనకర అంశం. తాజా గా వెల్లడైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 గణాంకాలు జిల్లాలోని పరిస్థితులను వెలుగులోకి తెచ్చాయి. గత సర్వేతో పోలిస్తే కొన్ని అంశాల్లో పురోగతి నమోదైనప్పటికీ, ఇంకొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు..

జిల్లాలో బాల్య వివాహాల సూచిక పెరగడం గమనార్హం. 20 నుంచి 24 ఏళ్ల యువతుల్లో 18 ఏళ్లు నిండకముందే వివాహమైన వారి శాతం ఐదో సర్వేలో 20.8 ఉండగా ఆరో సర్వేలో 29.8కి చేరింది. అంటే తొమ్మిది శాతం పాయింట్ల పెరుగుదల నమోదైంది. బాల్య వివాహాల నివారణకు చేపడుతున్న చర్యలను సమీక్షించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. మరోవైపు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు లేదా వాటి నియంత్రణకు మందులు వాడుతున్న పురుషుల శాతం 18.4 నుంచి 29.5కు పెరిగింది. మహిళల్లో ఈ సూచిక 18.3 నుంచి 22.5 శాతానికి చేరింది. మహిళల్లో అధిక బరువు, ఊబకాయం సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 49 ఏళ్ల మహిళల్లో ఈ సమస్య గత సర్వేలో 31 శాతం ఉండగా తాజాగా 44 శాతానికి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య పరీక్షలు, ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. చిన్నారుల పోషణలోనూ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం 28.4 నుంచి 18.5 శాతానికి తగ్గింది. అయితే వయసుకు తగిన బరువు లేనివారి శాతం 25.3 నుంచి 26కు పెరిగింది. ఎత్తుకు తగిన బరువు లేకపోవడం 21.8 నుంచి 21.6 శాతానికి స్వల్పంగా తగ్గింది. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో సిజేరియన్ల శాతం 73.1 నుంచి 79.6కు పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం 48.6 నుంచి 42.7 శాతానికి తగ్గింది. జిల్లావ్యాప్తంగా మొత్తం సిజేరియన్ల శాతం 58 నుంచి 55.6కు తగ్గడం గమనార్హం. ఇక రెండేళ్ల నుంచి నాలుగేళ్ల చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్య హాజరు 73.9 నుంచి 62.7 శాతానికి పడిపోయింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషణ, ప్రారంభ విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించాల్సిన అవసరం ఉంది.

కొన్నింట్లో ఆశాజనక ఫలితాలు

ఆందోళన కలిగించే అంశాలతో పాటు జిల్లాలో కొన్ని ఆరోగ్య సూచికలు మెరుగుపడ్డాయి. ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం గత సర్వేలో 97.4 ఉండగా తాజాగా 98.4కు పెరిగింది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో జరిగిన ప్రసవాల శాతం 53.9 నుంచి 61.5కు చేరింది. గర్భధారణ సమయంలో కనీసం 180 రోజులు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు తీసుకున్న మహిళల శాతం 42.3 నుంచి 71.6కు పెరగడం సానుకూల పరిణామం. పుట్టిన గంటలోపు తల్లిపాలు అందిన చిన్నారుల శాతం 40.2 నుంచి 61.5కు చేరింది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన ఎత్తుకు తగిన బరువు లోపం 9 నుంచి 5.9 శాతానికి తగ్గింది. మరోవైపు 15 నుంచి 19 ఏళ్ల వయసులో తల్లులైన లేదా గర్భిణులైన వారి శాతం 13 నుంచి 7.4కు తగ్గింది. ఈ పురోగతిని కొనసాగిస్తూనే బాల్య వివా హాలు, మధుమేహ సంబంధిత సమస్యలు, ఊబ కాయం, చిన్నారుల పోషణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.

సాధారణ ప్రసవానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే తల్లీబిడ్డ ఆరోగ్యానికి ముప్పు ఉన్నప్పుడు సిజేరియన్‌ తప్పనిసరి కావచ్చు. లేని పక్షంలో సిజేరియన్‌ అవసరం రాదు. గర్భాధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ సిజేరియన్‌ ఎందుకు అవసరమో వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

– చల్లగుళ్ల పూజ,

గైనకాలజిస్ట్‌, భద్రాచలం ఏరియా ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement