● ఉన్న వనరులతో తాగునీటికే ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
ఖమ్మం అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నందున యాసంగిలో వరికి బదులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇదే సమయాన వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పంటలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర టీ.ఎస్., అంకిత్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి మంగళవారం సమీక్షించారు. భూగర్భ జలాల తగ్గుదల, సాగునీటి లభ్యత, తాగునీటి సరఫరా, వ్యవసాయం, విద్యుత్, పశుగ్రాసం లభ్యతపై చర్చించి సూచనలు చేశారు. వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. యాసంగిలో వరి సాగు చేసి రైతులు నష్టపోకుండా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఇతర పంటలకు ప్రోత్సహిస్తూ విత్తనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను సమర్థంగా నిర్వహిస్తూ, మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని, గ్రామాల్లో పాత తాగునీటి పథకాలు, బోర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులను అవసరమైన చోట పునరుద్ధరించాలని సూచించారు. పశుగ్రాసం కొరత రాకుండా పచ్చిగడ్డి పెంపకాన్ని ప్రోత్సహించాలని, పశువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ పొదుపు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, ఆస్పత్రుల్లో మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ భూగర్భ జలమట్టాలు సుమారు రెండు మీటర్లు తగ్గాయని, కామేపల్లి, మధిర, ఏన్కూరు, సత్తుపల్లి, ఎర్రుపాలెం ప్రాంతాల్లో జలమట్టాలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. భద్రాద్రి కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు సుమారు 3.5 మీటర్లు తగ్గాయని తెలిపారు. సుమారు 40 వేల ఎకరాల్లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు. సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ ఖాదర్ బాబా, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


