ఆయిల్‌ఫెడ్‌లో ఇంటి దొంగలు! | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ఫెడ్‌లో ఇంటి దొంగలు!

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

దమ్మపేట రైతుల ఖాతాల్లో మిగులు గెలల నగదు

సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తింపు

ఎండీ విచారణలో బయటపడిన ఉద్యోగుల అక్రమాలు

అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో ఇంటి దొంగల పరంపర కొనసాగుతూనే ఉంది. వారం క్రితం చోటుచేసుకున్న ఘటన తాజాగా బట్టబయలైంది. అశ్వారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో గెలల క్రషింగ్‌ను నిర్వహణ పనుల నిమిత్తం ఈనెల 11 నుంచి నిలిపివేశారు. దీంతో అశ్వారావుపేట మండలంలోని రైతులు తమ గెలలను రెండు టన్నులలోపైతే అశ్వారావుపేటకు, అంతకంటే ఎక్కువైతే దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలించాలని అధికారులు సూచించారు. ఇదే విధానాన్ని రైతులు పాటిస్తున్నారు. ఈమేరకు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి రైతులు తీసుకొచ్చిన గెలలను అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలిస్తున్న క్రమంలో ఇంటి దొంగలు చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది.

సీసీ కెమెరాలకు విద్యుత్‌ నిలిపివేసి..

అశ్వారావుపేట ఫ్యాక్టరీలో మేనేజర్‌తో పాటు కొందరు మాత్రమే ఆయిల్‌ఫెడ్‌ సిబ్బంది ఉంటారు. ఫ్యాక్టరీ నిర్వహణ 90శాతం ప్రైవేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థ పరిధిలో కొనసాగుతోంది. గెలలను కాంటా వేయడం, అన్‌లోడ్‌, క్రషింగ్‌ పర్యవేక్షణే కాక ఆపరేటర్లు, కార్మికులు అంతా ప్రైవేట్‌ కంపెనీ సిబ్బందే నిర్వర్తిస్తారు. అయితే, ఇవన్నీ మేనేజర్‌ కనుసన్నల్లో జరగాల్సి ఉంటుంది. ఈక్రమాన రైతుల నుంచి సేకరించిన గెలలను ఆయిల్‌ఫెడ్‌ సమకూర్చే వాహనంలో కాకుండా కొన్నింటిని తిరిగి కాంటా ఓ ప్రైవేట్‌ కంపెనీ ట్రాక్టర్‌లో పంపించారు. ఫ్యాక్టరీలో సీసీ కెమెరాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి ఇదంతా చేశాక దమ్మపేట మండలానికి చెందిన ఇద్దరు రైతుల ఖాతాల్లో 3.48 టన్నుల గెలల నగదు జమ చేసినట్లు తెలిసింది. ఈ విషయం కాస్తా ఆయిల్‌ఫెడ్‌ ఎండీ యాస్మిన్‌ బాషా దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టగా ఇంటి దొంగలు తమ తప్పిదాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఇదే సమయాన రైతు సంఘం నాయకులు జోక్యం చేసుకుని రైతుల కష్టాన్ని దోచుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం వారి స్వప్రయోజనాలకు ఘటనను వాడుకునేలా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

పట్టించిన టెక్నాలజీ

అశ్వారావుపేట ఫ్యాక్టరీ నిర్వహణలో లేకున్నా రాత్రింబవళ్లే కాక వర్షంలో కూడా పనిచేసేలా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఒకవేళ ఫుటేజీ ఇక్కడి ఫ్యాక్టరీలో రికార్డు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నా, డిలీట్‌ చేసినా.. మెయిన్‌ సర్వర్‌లో మాత్రం రికార్డు అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఈ విషయం తెలియని ఉద్యోగులు కెమెరాలకు విద్యుత్‌ సరఫరా నిలివేశాక, గెలలను రెండో సారి కాంటా వేయించి నంబర్‌ లేని వాహనాల్లో అప్పారావుపేట ఫ్యాక్టరీకి పంపించారు. ఆపై నగదును నగదు బినామీ రైతుల ఖాతాల్లో జమ చేయించారు. ఈ విషయమై మెయిన్‌ సర్వర్‌లోని ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టడంతో అక్రమాల గుట్టరట్టయింది. కాగా, ఈ విషయమై అశ్వారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ కార్తీక్‌ను సంప్రదించగా తన ఆర్థిక అవసరాల నిమిత్తమే గెలల నగదును తెలిసిన రైతుల ఖాతాల్లో జమ చేశానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement