అశ్వాపురం: మండల పరిధిలోని జగ్గారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన బొగ్గును మణుగూరు ఏరియా సింగరేణి సెక్యూరిటీ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. జగ్గారంలో బొగ్గు నిల్వ ఉంచారనే సమాచారంతో సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్ స్పెషల్ టీంతో జగ్గారం గ్రామ పరిధిలోని ఊకెవారిగూడెంలో తనిఖీలు నిర్వహించి రెండు స్థావరాల్లో సుమారు 60 టన్నుల బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. బొగ్గు ఉన్న స్థావరాల సమీపంలో ఇటుక బట్టీలు ఉండడంతో దానిలో వాడేందుకు నిల్వ ఉంచినట్టు అధికారులు భావిస్తున్నారు. తొలుత ఈ నిల్వ విషయాన్ని సింగరేణి సెక్యూరిటీ అధికారులు భారజల కర్మాగారం అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రవీణ్‌కు సమాచారం ఇవ్వగా ఆయన భారజల కర్మాగారం డీజీఎం రఫీక్, ఐఆర్‌ఓ కృష్ణకాంత్, డీఆర్‌సీసీ ఏజీఎంకు తెలియజేశారు. ఈక్రమాన మణుగూరు డీఆర్‌సీసీ నుంచి భారజల కర్మాగారానికి రోప్‌వే ద్వారా బకెట్లలో సరఫరా అవుతున్న బొగ్గును చోరీ చేసి అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు భావిస్తున్నారు. బొగ్గు అక్రమ రవాణాపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.


