రుద్రంపూర్: సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ చెల్లించిన యాజ మాన్యం, కొత్తగూడెం డివిజన్ పరిధి సూపర్‌బజార్‌లలో ఉద్యోగులకు అడ్వాన్స్ మాత్రం ఇవ్వలేదు. పండుగ ముందు రోజు వరకు రూ.25వేలు వస్తాయని చూసినా, రాకపోవడంతో ఉద్యోగులకు నిరా శే ఎదురైంది. కొత్తగూడెం డివిజన్‌లో 25 మంది పనిచేస్తుండగా, శ్రీరాంపూర్, గోదావరిఖనిలో చెల్లించిన యాజమాన్యం ఇక్కడి ఉద్యోగులను విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతీనెల వేతనం నుంచి రికవరీ చేసుకునే అడ్వాన్ చెల్లించకపోవడం సరికాదని ఉద్యోగులు వాపోయారు. ఈ విషయమై సూపర్‌బజార్ డివిజన్ మేనేజర్ దేవదాస్‌ను వివరణ కోరగా.. లావాదేవీలు ఉన్నా, లేకున్నా ప్రతీనెల ఉద్యోగులకు రూ.2.70లక్షలకు పైగా వేతనాలు చెల్లిస్తున్న నేపథ్యాన పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. రిటైర్ అయిన కార్మికులంతా రామగుండం, శ్రీరాంపూర్ వెళ్తుండడంతో ఇక్కడ సూపర్‌బజార్‌లో అమ్మకాలు, గ్యాస్ కనెక్షన్లు పడిపోయాయని తెలిపారు.
కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాను జీఎస్టీతో సంబంధం లేకుండా చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నా చేయగా నాయకులు మాట్లాడుతూ పండుగ వరకు ఇదిగో, అదిగో అని చివరికి వాటా చెల్లించకపోవడం సరికాదన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం విడనాడి రూ.5,500 చొప్పున చెల్లించాలన్నారు. నాయకులు భూక్యా రమేష్, మాతంగి రాజేష్, ఎన్.రమేష్, ప్రమోద్, శివ, గడల నర్సింహారావు, ఎన్.ఎస్.రాజు, మహ్మద్ నసూర్ పాల్గొన్నారు.


