పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని ఖమ్మం అటవీ డివిజనల్ అధికారి(ఎఫ్‌డీఓ) భవానీ శంకర్ కుటుంబ సమేతంగా శుక్రవారం సందర్శించారు. డీర్‌పార్కులో దుప్పుల పెంపకం, యానంబైల్ రేంజ్‌లో వన్య, అటవీ సంరక్షణ కోసం పాటిస్తున్న విధానాలను వైల్డ్‌లైఫ్ సెక్షన్ ఆఫీసర్ కిషన్‌ను అడిగితెలుసుకున్నారు. అనంతరం జలాశయంలో బోటు షికారు చేశారు.
బేతుపల్లి కాల్వకు
గోదావరి జలాలు
వేంసూరు: వేంసూరు మండలంలోని 46 చెరువుల ద్వారా సాగునీరు అందించే బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వలో గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది బేతుపల్లి జాలాలు రాకపోవడంతో చెరువుల్లో జలాలు అడుగంటి, రైతులు వరి పంట వదిలేశారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ కాల్వలోకి గోదావరి జలాలు చేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ కెనాల్‌కు గోదావరి జలాలు విడుదల చేయగా, వేంసూరు మండలం వైఎస్ బంజర్ వద్ద కెనాల్‌పై ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకం ద్వారా బేతుపల్లి కాల్వకు తరలిస్తున్నారు. వేంసూరు ఎత్తిపోతల పథకం ద్వారా 50క్యూసెకుల నీటిని తాగునీటి అవసరాల కోసం చెరువులకు మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, గోదావరి జలాలను వేంసూరు చెరువుకు వెళ్తుండగా.. కాల్వ పక్కనే ఉన్న వరి పొలాలకు నీరు పెట్టుకోనివ్వడం లేదని రైతులు పలువురు పేర్కొన్నారు. లిఫ్ట్ నిర్వహణ ఖర్చులు చెల్లించాలని ఆంక్షలు విధించడం సరికాదని పలువురు వాపోయారు.


