అనుమతే తరువాయి! | - | Sakshi
Sakshi News home page

అనుమతే తరువాయి!

Sep 30 2026 12:46 AM | Updated on Sep 30 2026 12:46 AM

వసతుల కల్పనపై దృష్టి

సరిహద్దు ప్రాంతాలకూ పెద్దదిక్కు

మూడు విభాగాల్లో పూర్తయిన ఎన్‌ఎంసీ తనిఖీ

మంజూరైతే ఏజెన్సీలో బలోపేతం కానున్న వైద్యసేవలు

ఏజెన్సీకి మరింత బలం

భద్రాచలం అర్బన్‌: ఏజెన్సీ ప్రాంత ప్రజల వైద్యసేవల్లో పెద్దదిక్కుగా నిలుస్తున్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి పీజీ వైద్య విద్య దిశగా అడుగులు వేస్తోంది. జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో నాలుగు చొప్పున 12 పీజీ సీట్లకు ప్రతిపాదనలు పంపగా.. జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) తనిఖీలు పూర్తయ్యాయి. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్లకు అనుమతి లభిస్తే ఏరియా ఆస్పత్రిలో పీజీ వైద్య కోర్సులకు మార్గం సుగమమవుతుంది. తద్వారా వైద్య విద్యే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో వైద్యసేవలు మరింత బలోపేతం కానుంది.

సంతృప్తి వ్యక్తం చేసినట్టే..

జనరల్‌ సర్జరీ, గైనకాలజీ విభాగాలకు సంబంధించిన ఎన్‌ఎంసీ బృందం సభ్యుల తనిఖీలు గతంలోనే పూర్తయ్యాయి. తాజాగా పీడియాట్రిక్స్‌లో ప్రతిపాదించిన నాలుగు సీట్లకు సంబంధించి మరో బృందం పరిశీలించింది. ఇక్కడ అందుతున్న వైద్యసేవలు, రోజువారీ ఓపీ, వైద్యులు, సిబ్బంది, పరికరాలు, బోధనా వసతులు, రికార్డులను తనిఖీ చేశారు. ఈక్రమాన ఇక్కడ వసతులపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

సమకూరాల్సింది ఇవే..

ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తయినప్పటికీ పీజీ సీట్లు మంజూరు కావాలంటే ఇంకొంత ప్రక్రియ మిగిలి ఉంది. కోర్సుల నిర్వహణకు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బోధనా సిబ్బందిని సమకూర్చాలి. అవసరమైన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఇతర బోధనా పోస్టుల భర్తీతో పాటు వైద్య పరికరాలు, అనుబంధ వసతులను అందుబాటులోకి తీసుకురావాలి. తనిఖీల్లో ఏవైనా లోటుపాట్లను గుర్తిస్తే కనుక వాటిని సరిచేయాల్సి ఉంటుంది. ఇదంతా సాఫీగా సాగితే 12 పీజీ సీట్ల మంజూరుపై స్పష్టత వస్తుంది.

అనుమతి వస్తే సేవల విస్తరణ

పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తే ఆస్పత్రిలో వైద్యవిద్యకు శ్రీకారం చుట్టడంతో పాటు వైద్యసేవలూ విస్తరించే అవకాశముంది. పీజీ అభ్యర్థుల శిక్షణకు అనుగుణంగా ఆయా విభాగాల్లో వైద్య కళాశాల అధ్యాపకులు, పరికరాలు, ఇతర సదుపాయాలు పెరుగుతాయి. సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ విభాగాలు మరింత బలోపేతమైతే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతుంది.

మూడు విభాగాల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తయ్యాయి. పీజీ కోర్సుల నిర్వహణకు అవసరమైన బోధనా సిబ్బంది, వైద్య పరికరాలు సమకూర్చాల్సి ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతాం.

–డాక్టర్‌. రవిబాబు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి

భద్రాచలంతో పాటు దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు తదితర మండలాల ప్రజలకు ఈ ఆస్పత్రే ప్రధాన ఆధారం. అంతేకాక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి సైతం వైద్యం కోసం వస్తుంటారు. ముఖ్యంగా ప్రసవాలు, చిన్నారుల వైద్యం, శస్త్రచికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మూడు ప్రధాన విభాగాల్లో పీజీ కోర్సులు ప్రారంభమైతే నిపుణులు అందుబాటులోకి వచ్చి క్లిష్టమైన కేసులకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతుంది.

భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పీజీ సీట్లకు ప్రతిపాదన

భద్రాచలం ఆస్పత్రిలో పీజీ సీట్లు అందుబాటులోకి వస్తే ఏజెన్సీ ప్రజలకు ఉపయోగం. పీజీ కోర్సులు ప్రారంభమైతే నిపుణుల సేవలు అందుతాయి. ఇందుకోసం ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేస్తా.

– డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్యే, భద్రాచలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement