● రైతు, కూలీల ప్రాతినిధ్యం, అధికార సాధనకు పోరాటం ● ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల్లో ప్రొఫెసర్ మనోరంజన్
ఖమ్మంమయూరిసెంటర్: అటవీ సంరక్షణ చర్యలు, టైగర్ రిజర్వ్‌లు, జాతీయ పార్కుల పేరుతో ఆదివాసీలను సొంత భూముల నుంచి పంపించి నిర్వాసితులుగా చేయడం దారుణమని ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల కంటే అడవులను ఎలా కాపాడుకోవాలో ఆదివాసీలకే బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాలుగో జాతీయ మహాసభల రెండో రోజైన మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన సభకు జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షత వహించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ ప్రతినిధులను ఆహ్వానించగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ మనోరంజన్ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రయోజనాలు, బడా సంస్థల లాభాలు, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూపించడంపై తప్ప... మెజార్టీ ప్రజలైన కార్మికులు, రైతులు, ఆదివాసీలు, దళితుల సంక్షేమంపై ఎవరికీ పట్టింపు లేదని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చడానికి క్షేత్రస్థాయిలో ఉద్యమాలను పునర్నిర్మించుకో వాల్సిన అవసరం ఉందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో మొదలుకావాలి
రాజకీయం, ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృతమైనట్లే ఉద్యమాలు కూడా కేంద్రీకృతమైపోయాయని మహంతి అభిప్రాయపడ్డారు. పంజాబ్ రైతుల పోరాటంతో నల్ల చట్టాలు రద్దయ్యాయని.. ఇందులో క్షేత్రస్థాయి భాగస్వామ్యమే కారణమని తెలిపారు. ఈమేరకు ఉద్యమాలు గ్రామాలు, పంచాయతీల వైపు మళ్లాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థలను ఉద్యమాల సాధనాలుగా మార్చుకోవాలని తెలిపారు. సభలో వివిధ రాష్ట్రాలు, సంఘాల తరపున కె.సెల్వరాజ్, విజయ ఉపాధ్యాయ, కెచ్చల రంగయ్య, ప్రవీణ్‌కుమార్, కె.మోహభ్‌రెడ్డి, కె.శ్రీనివాస్, జి.ఝాన్సీ, మహేష్ తమ సందేశం ఇచ్చారు. ఇంకా ఈ సభలో ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్, నాయకులు సుశాంత్ ఝూ, జే.వీ.చలపతిరావు, శంభుప్రసాద్, రామేందర్ సింగ్, బాలచంద్ర సడంగి, మండల వెంకన్న, బిక్షపతి, సుధాకర్, చిట్టిపాటి పాల్గొన్నారు.


