భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు నిర్వహించారు. అనంతరం స్టేడియంలోని శ్రీరామ సేవా మండపంలో కొలువుదీర్చి నిత్యకల్యాణ మూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
డీలక్స్ బస్సులకు
ఎక్స్‌ప్రెస్ చార్జీలు
భద్రాచలంటౌన్/ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం – భద్రాచలం, ఖమ్మం – సత్తుపల్లి మార్గాల్లో నడిచే డీలక్స్ బస్సులకు బుధవారం నుంచి ఎక్స్‌ప్రెస్ చార్జీలను అమలు చేస్తున్నట్లు ఖమ్మం, భద్రాచలం ఆర్‌టీసీ డిపో మేనేజర్లు శివప్రసాద్, పి.జంగయ్య తెలిపారు. ఖమ్మం – భద్రాచలం డీలక్స్ బస్సు చార్జీ రూ.180 ఉండగా, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ మాదిరి రూ.170, ఖమ్మం – సత్తుపల్లి మార్గంలో రూ.130కి బదులు రూ.120కి తగ్గించినట్లు పేర్కొన్నారు. మిగతా అన్ని స్టేజీలకు కూడా ఎక్స్‌ప్రెస్ చార్జీలే వర్తించనున్నందున ప్రయాణికులు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఎస్సీ కార్పొరేషన్
ఈడీగా విజయలక్ష్మి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఈడీగా పి.విజయలక్ష్మి నియమితులయ్యారు. ఇన్నాళ్లు విధులు నిర్వర్తించిన ఆర్.ఉపేందర్‌రావు నుంచి మంగళవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. బీసీ సంక్షేమాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న విజయలక్ష్మికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కలెక్టర్ అంకిత్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానంతో అటవీ సంరక్షణ
చుంచుపల్లి: అటవీ నేరాల నియంత్రణ, సమాచారంపై వేగంగా స్పందించేలా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మరింత పటిష్టం చేయనున్నట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఈమేరకు అటవీశాఖ కమాండ్ కంట్రోల్ బృందానికి పోలీసు శాఖ ఆధ్వర్యాన మంగళవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొత్తగూడెంలోని జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇన్‌చార్జ్ సీఐ రమాకాంత్ మాట్లాడారు. సమాచారం సేకరణ, తీవ్రతను విశ్లేషించడం, అధికారులకు చేరవేయడం, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం తదితర అంశాలను వివరించారు. ఆతర్వాత డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ మాట్లాడుతూ కలప నరికివేత, రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలు, అనుమానాస్పద కార్యకలాపాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక్కడకు అందే సమాచారాన్ని క్షేత్రస్థాయి ఉద్యోగులకు చేరవేసేలా వ్యవస్థ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు, అటవీ శాఖ ఉద్యోగులు షేక్ ఇమామ్, రాజేందర్, రాకేష్, ఉపేందర్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అర్హులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అర్హులు ఓటు హక్కు ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. డిగ్రీ, తత్సమాన కోర్సు పూర్తిచేసి ఈ ఏడాది నవంబర్ 1నాటికి మూడేళ్లు నిండిన వారు అర్హులని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రంగప్రసాద్, ఉద్యోగులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.


