పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): వెట్‌ల్యాండ్స్ డీమార్కేషన్, అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్‌ల్యాండ్స్ సరిహద్దుల నిర్ధారణలో ఆన్‌లైన్ రికార్డులు, మ్యాపింగ్‌కు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి హద్దులను కచ్చితంగా నిర్ధారించాలని సూచించారు. ఈక్రమాన రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులు సాంకేతికత పరికరాల ద్వారా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అటవీ ఆక్రమణల తొలగింపు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో సర్వే సమయాన పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. అంతేకాక అటవీ సిబ్బందిపై దాడులు, బెదిరింపులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కాగా, కిన్నెరసాని ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, భద్రాచలం ఎఫ్‌డీఓ నిషా, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): భూముల రీసర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ అంకిత్ సూచించారు. అన్నపురెడ్డిపల్లి మండలం నర్సాపురం శివారులో సర్వేను పరిశీలించి సూచనలు చేశారు. రెవెన్యూ, సర్వే, అటవీ, సంబందిత శాఖల రికార్డులతో సమగ్రంగా సరిపోల్చుకుని హద్దులు నిర్ధారించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, గిరిజన బాలికల గురుకులాలను కలెక్టర్ తనిఖీ చేశారు. మెనూ పక్కాగా పాటిస్తూ విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. తహసీల్దార్ స్వర్ణ, ఎంఈఓ అనంద్‌కుమార్. ప్రిన్సిపాళ్లు బాలరాజు, చైతన్య, ఉద్యోగులు ఉన్నారు.
సమీక్ష సమావేశంలో కలెక్టర్ అంకిత్
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా, పారదర్శకంగా సాగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఈ సీజన్‌లో సుమారు 1.28లక్షల మె.టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంకాగా, 190 కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే కేంద్రాల సంఖ్య పెంచాల్సి ఉంటుందన్నారు. బోనస్ అందే రకాలు, తేమ శాతం, కేంద్రాల వివరాలు, మద్దతు ధరపై విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. అంతేకాక కేంద్రాల్లో గన్నీ బ్యాగ్‌లు, తూకం యంత్రాలు సమకూర్చుకుని, ఎప్పటికప్పుడు మిల్లులకు మిల్లులకు తరలించాలని తెలిపారు. ఇదే సమయాన పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా కట్టడి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్‌బాబు, డీఏఓ బాబురావు, రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి అలీమ్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిది ఆనందరావు పాల్గొన్నారు.


