పదాల రక్షణ.. భాషకు భద్రత | - | Sakshi
Sakshi News home page

పదాల రక్షణ.. భాషకు భద్రత

Sep 30 2026 12:46 AM | Updated on Sep 30 2026 12:46 AM

● భద్రాచలంలో వచ్చేనెల 2నుంచి గోండు – కోయ నిఘంటువు వర్క్‌షాప్‌ ● హాజరుకానున్న ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులు ● ప్రాంతాల వారీగా పదాలు, అర్థాలపై చర్చకు అవకాశం అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే...

తొలిసారిగా 2014లో..

● భద్రాచలంలో వచ్చేనెల 2నుంచి గోండు – కోయ నిఘంటువు వర్క్‌షాప్‌ ● హాజరుకానున్న ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులు ● ప్రాంతాల వారీగా పదాలు, అర్థాలపై చర్చకు అవకాశం

భద్రాచలం: జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కు భద్రాచలం వేదిక కానుంది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న ఐటీడీఏ ప్రాంగణంలో ఈ వర్క్‌షాప్‌ జరగనుంది. ఆదివాసీల్లో తరతరాలుగా మౌఖికంగా సాగుతున్న గోండు – కోయ భాషా సంపద పరిరక్షణ, ప్రాంతాల వారీగా వినియోగంలో ఉన్న పదాలు, యాసలు, ఉచ్ఛారణలు, అర్థాలకు ప్రామాణిక రూపాన్ని తీసుకొచ్చేందుకు ఈ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. వచ్చేనెల 2నుంచి 5వ తేదీ వరకు జరిగే 12వ జాతీయ గోండు – కోయ భాష ప్రామాణీకరణ నిఘంటువు వర్క్‌షాప్‌లో భాషా నిపుణులు పాల్గొననున్నారు.

భవిష్యత్‌ తరాల కోసం

గోండు భాషను ప్రామాణీకరించి భవిష్యత్‌ తరాలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌ల ద్వారా భాష మాట్లాడే వారి నుంచి పదాల సేకరణ, వాటి అర్థాలు, వినియోగ విధానాలను నమోదు చేయడమేకాక ప్రాంతీయ భాషా భేదాలను పరిశీలిస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే గోండు భాష వనరులు, నిఘంటువులు ఉన్నాయి. కానీ ప్రాంతాల వారీగా ఒకే భావానికి భిన్నమైన పదాలు, ఉచ్ఛారణలు ఉండడంతో వాటిని శాసీ్త్రయంగా పరిశీలించి ప్రామాణిక పదజాలాన్ని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రాంతాల విస్తృతి, యాసలు, పదజాలం, జీవన విధానానికి సంబంధించిన ప్రత్యేక పదాల కారణంగా భాషా సంపదను మరింత సమగ్రంగా నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యాన జరిగే జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

భాషను రక్షిస్తే సంస్కృతిని కాపాడినట్లే

నిఘంటువు తయారీ అంటే ఆదివాసీ తరతరాల భాషా సంపదను నమోదు చేసి, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందించే దీర్ఘకాలిక కృషిగా చెబుతున్నారు. ఓవైపు ప్రాంతీయ భాషా వైవిధ్యాన్ని గుర్తిస్తూ, మరోవైపు అందరికీ ఉపయోగపడే ప్రామాణిక పదజాలాన్ని రూపొందించడం ఇందులో కీలకం కానుంది. ఈమేరకు 2వ తేదీ నుంచి భద్రాచలంలో జరిగే 12వ జాతీయ గోండు – కోయ భాష ప్రామాణీకరణ నిఘంటువు వర్క్‌షాప్‌ భాషా పరిరక్షణ దిశలో అగ్రభాగాన నిలుస్తుందని భావిస్తున్నారు. ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులు 120మంది ఒకే వేదికపైకి రావడంతో ఆయా ప్రాంతాల భాషా సంపద, అనుభవాలు, అభిప్రాయాలు పరస్పరం పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ చర్చల ద్వారా గోండు – కోయ భాషా ప్రామాణీకరణకు దశాదిశ లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

గోండు భాషకు భాషకు గుర్తింపువచ్చేలా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించాలి. గత ఏడాది మధ్యప్రదేశ్‌ ఎంపీ ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రస్తావించారు. భద్రాచలంలో వర్క్‌షాప్‌ నిర్వహించడం ఇది రెండో సారి. గతంలో పలుచోట్ల జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లకు కన్వీనర్‌గా హాజరయ్యా. గోండు – కోయ భాషలకు జాతీయ గుర్తింపు సాధించడమే కాక అసెంబ్లీలో తీర్మానించాలనే డిమాండ్‌ను ఈ వర్క్‌షాప్‌ వేదికగా ప్రకటిస్తాం.

– మడివి నెహ్రూ, ప్రోగ్రాం ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌

ఏదైనా భాషకు నిఘంటువు అంటే పదాల అర్థాలు మాత్రమే కాదు... వారి చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, జానపద విజ్ఞానం, ప్రకృతితో ముడిపడిన జీవన విధానాన్ని భద్రపరిచే ప్రక్రియగా భాషా పండితులు పేర్కొంటున్నారు. గోండు – కోయ భాషకు సమగ్ర ప్రామాణిక నిఘంటువు అందుబాటులోకి వస్తే విద్యా సామగ్రి, భాషా పుస్తకాలు, పాఠ్యాంశాలు, పరిశోధనలు, డిజిటల్‌ కంటెంట్‌, అనువాదాలు సులువు కానున్నాయి. అంతేకాకుండా యువత నేర్చుకునేలా వనరులు అందుబాటులోకి వస్తాయి. ఇందుకోసమే 2014లో గోండు, కోయ భాషలపై తొలి ప్రామాణీకరణ వర్క్‌షాప్‌ ఏర్పాటుచేశారు. అనంతరం మైసూరు, అమర్‌కంటక్‌, ఆదిలాబాద్‌, భద్రాచలం, చంద్రాపూర్‌, హంపి తదితర ప్రాంతాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement