మృతదేహంతో కుటుంబీకుల ధర్నా
సూపర్‌బజార్(కొత్తగూడెం): సముద్రంలో ఈత కొట్ట డం తెలిసిన కుమారుడు మున్నేటిలో మునిగి మృతి చెందాడంటే నమ్మలేకపోతున్నామని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయ తీ పరిధి తిలక్‌నగర్‌కు చెందిన గడ్డం మధు తల్లి దుర్గ పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి ఇటీవల డోర్నకల్ వద్ద మున్నేటికి వెళ్లిన ఆయన నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని సోమవారం కొత్తగూడెం తీసుకురాగా కుటుంబీకులు, బంధువులు కలిసి మధును తీసుకెళ్లిన వారి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈమేరకు రాత్రి వరకు ధర్నా కొనసాగగా టూటౌన్ ఇన్‌చార్జ్ సీఐ కరుణాకర్, ఎస్సై రాజశేఖర్ చేరుకుని వారితో చర్చించారు. పూర్తిస్థాయిలో కేసు విచారణ అనంతరం ఎవరి తప్పు ఉన్నట్లు తేలినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ నచ్చచెప్పడంతో సీఐ ఆందోళన విరమించారు.
చెత్త ట్రాక్టర్ల అడ్డగింత
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కార్పోరేషన్ పరిధి పాతకొత్తగూడెం మీదుగా సోమవారం రాత్రి డంపింగ్ యార్డుకు చెత్త తీసుకెళ్లున్న ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన వస్తున్నందున చెత్త వేయడానికి వీల్లేదని ఆందోళన నిర్వహించారు. దీంతో చెత్తతో వచ్చిన ట్రాక్టర్లను డ్రైవర్లు తిరిగి తీసుకెళ్లారు. కాగా, మంగళవారం పూర్తి స్థాయిలో వాహనాలను అడ్డుకుంటామని స్థానికులు తెలిపారు.


