సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా విశిష్ట సేవలు అందించారని.. ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని అంతా ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఆదివారం కలెక్టరేట్‌లో బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించగా, ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించాక మాట్లాడారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాక మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకున్నారని గుర్తుచేశారు. సమాజంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన ఆస్తులను సైతం దానం చేసిన త్యాగశీలి అని తెలిపారు. బీసీ సంక్షేమాధికారి పి.విజయలక్ష్మి, నాయకులు చిప్పా శ్రీనివాస్, ఇమంది ఉదయ్‌కుమార్, మోత్కూరి ధర్మారావు, బి.సత్యనారాయణ, గుమలాపురం సత్యనారాయణ, కొదుమూరు సత్యనారాయణ, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
జయంతి వేడుకల్లో కలెక్టర్ అంకిత్


