ఏజెన్సీ ప్రాంతాల్లో నాటు వైద్యం..!
మూడేళ్లలో నమోదైన
కుక్కకాటు వివరాలు..
మూడేళ్లలో 14,807 కేసులు నమోదు
పెరుగుతున్న వీధి కుక్కల బాధితులు
నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
ప్రథమ చికిత్సే ప్రధానం..
పాల్వంచరూరల్: గ్రామ సింహాలు(కుక్కలు) సంతంతి నానాటికీ పెరుగుతోంది. వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కల పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోకుంటే రేబిస్ వ్యాధికి గురికావాల్సిందే. జిల్లాలో గతేడాది పినపాకలో పెంపుడు కుక్క కరవడంతో రేబిస్ వ్యాధికి గురై యువకుడు మృతిచెందాడు. ఈక్రమాన రికార్డుల్లో ఎక్కని వారు కూడా కుక్కకాటుతో మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. పెంపుడు కుక్కే కదా అని అతిగా చేస్తే ప్రాణం మీదకు వచ్చే అవకాశం ఉంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ వీధికుక్కల స్వైరవిహారంతో కుక్కకాటుకు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
శస్త్ర చికిత్సలు నిల్..
గతంలో మండల, మున్సిపాలిటీ పరిధిలో సంచరించే వీధి కుక్కలను యానిమల్ కేర్ సెంటర్‌కు తరలించి సంతానోత్పత్తి కలగకుండా శస్త్రచికిత్సలు చేసేవారు. కానీ ప్రస్తుతం అలా ఆచరణలో ఎక్కడ అమలు కావడం లేదు. దీంతో కుక్కలు ఏడాదికి రెండుసార్లు చొప్పున పదులసంఖ్యలో పిల్లలకు జన్మనివ్వడంతో కుక్కల సంఖ్య భారీగా పెరుగుతోంది.
పెంపుడు కుక్కల లెక్కలేవి?
మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో పెంపుడు కుక్కల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యంలో వాటి సంఖ్యను నమోదు చేయకపోవడం, వ్యాక్సిన్లు వేయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కుక్కల బారిన పడుతున్న వారు కూడా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
రేబిస్ సంక్రమించే విధానం...
కుక్కలు, కోతులు, ఎలుకల కాటుతో నోటిలోని ద్రవాల ద్వారా మనుషులు, పశువులకు కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్త కుక్క కరిచినా, దాని సొంగ పుడ్లపై పడినా వ్యాధి సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మండల, ఏరియా ఆస్పత్రిల్లో చిన్నపాటి గాయమైతే రేబిస్ వ్యాక్సిన్ వేస్తారు కాని పెద్దగాయమైతే పెద్దాస్పత్రికి వెళ్లాల్సిందే. దీంతో బాధితులు పడరానిపాట్లు పడుతున్నారు. గ్రామాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను గాయపరుస్తున్నా పంచాయతీఽ అధికారులు పట్టించుకోవడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కోతులు, పందులు, దుప్పులు, ఎలుగుబంట్లు, ఎలుకలు, పందికొక్కులు కరిసినా, దాడిచేసి గాయపరిచినా కుక్క కాటు వ్యాక్సిన్ వేస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో గిరిజనులకు ఏదైనా కుక్క కరిస్తే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోకుండా ఆకు పసరుతో నాటు వైద్యం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. గిరిజనులకు అవగాహన లేక కుక్కలు, కోతులు కరిసినా, పాము కాటువేసినా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే డబ్బులు ఖర్చవుతాయని, వైద్యంతో నయం కాదని భావించి నాటు పసరుతో సొంత వైద్యం చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అవగాహన కల్పించి గిరిజనులను చైతన్య పరిచే నాథుడు లేక అనాదిగా ఇదే తరహా పద్ధతులను అనుసరిస్తున్నారు.
(పాల్వంచ ఏరియా ఆస్పత్రిలో ఈ ఏడాది సెప్టెంబర్ 27వరకు 989 మందికి కుక్కకాటుకు వ్యాక్సిన్ వేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.).
ఏడాది కుక్క కాటు
బాధితులు
2024 6,973
2025 5,647
2026 2,187
(సెప్టెంబర్ 27వరకు)
మొత్తం 14,807
గుబులు పుట్టిస్తున్న
గ్రామ సింహాలు
కుక్కకాటుకు గురైతే సమీప ఆస్పత్రికి వెళ్లి తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. రేబిస్‌కు ప్రథమ చికిత్సే ప్రధానం. కుక్క, పిల్లి వంటి జంతువుల ద్వారా మనుషులు, పశువులకు సంక్రమించే వైరస్ కావడంతో నాటు మందు, పసర్లతో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు. ముందుగా కుక్క కాటు వేసిన ప్రాంతంలో మంచినీటితో సబ్బుతో కడగితే ఫలితం ఉంటుంది. యాంటీవైరస్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్నాం.
– తుకారాం రాథోడ్ , డీఎంహెచ్‌ఓ


