అశ్వారావుపేట: చోరీ కేసులో నిందితుడైన వ్యక్తి పోలీస్ స్టేషన్ నుంచి పరారై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆపై గ్రామపెద్దల సమక్షంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ విషయంలో గ్రామస్తులు, పోలీసులకు ఎలాంటి సంబంధం/ అభ్యంతరం లేదంటూ కుటుంబ సభ్యులతో వాంగ్మూలం సేకరించడం చర్చనీయాంశంగా మారింది. అశ్వారావుపేట మండలం జమ్మిగూడెంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మిగూడెంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ జరగగా స్థానికులైన అన్నదమ్ములపై అనుమానంతో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిని మూడు రోజులుగా పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఒకరైన గోలిశెట్టి నాగు(29) పోలీస్ స్టేషన్ నుంచి మంగళవారం పరారయ్యాడు. ఆతర్వాత బుధవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడడంతో మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. తొలుత పోలీసు చిత్రహింసల కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రచారం జరగగా... మధ్యాహ్నం గ్రామస్తులు పంచాయితీ నిర్వహించి ఆయన తల్లితో వేలిముద్ర వేయించుకున్నారు. ఆ పత్రంపై గ్రామస్తులు, పోలీసులకు కానీ ‘సంబంధం’ లేదు అనే వాక్యంలో సంబంధం పదాన్ని కొట్టి వేసి ‘అభ్యంతరం’ అని రాసి మృతుడి భార్య, తల్లి వేలిముద్రలు వేయించడం గమనార్హం. పోలీసుల తీరుపై ఆరోపణలు వచ్చిన క్రమాన ఈ వాంగ్మూలం ఎందుకు తీసుకున్నారో తేలాల్సి ఉంది. ఈ విషయమై అశ్వారావుపేట ఎస్సై యయాతి రాజును సంప్రదించగా నాగు, రఘురాంను కొట్టి, తిట్టకుండా విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించారని తెలిపారు. చోరీ సొత్తు నాగు దాచిపెట్టిన చోటు నుంచి రఘురాం మాయం చేశాడని ఇద్దరూ వాదులాడుకున్నారన్నారు. ఇంటికి వెళ్లిన నాగును తండ్రి మందలించగా బుధవారం ఆత్మహత్యకు చేసుకున్నాడని ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
చోరీ కేసులో నిందితుడి
ఆత్మహత్యపై వాంగ్మూలం


