దమ్మపేట: అక్రమంగా తరలిస్తున్న రూ.7.05 లక్షల విలువైన టేకు దుంగలను జిల్లా అటవీ శాఖ టాస్క్‌ఫోర్స్, స్థానిక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అందిన సమాచారంతో మండలంలోని అంకంపాలెం బీట్‌లో బుధవారం తనిఖీలు చేపట్టగా టేకు కలప దుంగలు లభ్యమయ్యాయి. అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా నిల్వ చేసి 57 టేకు రౌండ్ దుంగలు (2.775 క్యూబిక్ మీటర్లు), 44 టేకు సాన్ సైజులు (2.460 క్యూబిక్ మీటర్లు) లభించాయని అధికారులు తెలిపారు. ఈ కలప విలువ రూ.7.05 లక్షలు కాగా, కేసు నమోదు చేశామని వెల్లడించారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్, ఎఫ్‌ఎస్‌ఓలు లోకనాథం, ప్రసాదలింగం, దమ్మపేట ఎఫ్‌ఆర్‌ఓ శ్రీను, బీట్ అధికారి ఏ.పార్వతి పాల్గొన్నారు.


