బందోబస్తుకు వెళ్లిన ఎస్‌ఐ మృతి | - | Sakshi
Sakshi News home page

బందోబస్తుకు వెళ్లిన ఎస్‌ఐ మృతి

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూత

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల కోసం హైదరాబాద్‌ వెళ్లిన కొత్తగూడెం టూ టౌన్‌ ఎస్‌ఐ కున్సోతు వెంకన్న(57) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వెంకన్న కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తుండగా ఇటీవలే మహబూబాబాద్‌కు బదిలీ అయింది. ఇంతలోనే గణేష్‌ నిమజ్జనం విధులు కేటాయించగా, బుధవారం తెల్లవారుజామున 2గంటల సమయాన ట్యాంక్‌బండ్‌ సమీపం నుంచి వెళ్తుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఘటనలో వెంకన్న తల, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కాగా పోలీసులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు కనిపించడంతో హనుమకొండకు తరలించి మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా రాత్రి 6గంటలకు మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడి జాడ కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్‌ బదిలీ అయిన వెంకన్న గణేష్‌ నిమజ్జనం అనంతరం రిలీవ్‌ కావాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా, అల్లుడు మణుగూరు బీటీపీఎస్‌లో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు.

రుణాల పేరుతో రూ.60 లక్షల టోకరా?

జగదీశ్‌ కాలనీ వాసిపై ఆరోపణలు

భద్రాచలంఅర్బన్‌: తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తానని ఒకరి వద్ద, కుదువ పెట్టి నగదు ఇప్పిస్తానంటూ ఇంకొకరి వద్ద, రుణంలో కొంత తనకు ఈఎంఐలు కడతానని మరొకరి వద్ద.. ఇలా పలువురిని నమ్మించి పెద్ద మొత్తంలో నగదు, బంగారం తీసుకున్నట్లు భద్రాచలంలోని జగదీశ్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ.60 లక్షల వరకు తీసుకున్నట్లు తెలియగా, ఇంకా పలువురు బాధితులు ముందుకు రావాల్సి ఉంది. అయితే, కొందరు ఉద్యోగులు కావడంతో విషయం చెప్పేందుకు వెనుకాడుతున్నట్లు సమాచారం. రుణాలు ఇప్పించే వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఉన్న సదరు వ్యక్తి పలువురితో పరిచయాలు పెంచుకుని ఒకరి నుంచి 83 గ్రాముల బంగారం, ఇంకొందరి వద్ద నగదు తీసుకున్నట్లు తెలిసింది. తిరిగి రుణవాయిల చెల్లింపు సమయం రావడంతో దాటవేస్తుండడంతో వెంకటేశ్వర కాలనీకి చెందిన ఉప్పు పవన్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రుణం ఇప్పిస్తానని చెప్పడంతో తొలుత రూ.75 వేలు, ఆతర్వాత విడతల వారీగా రూ.3లక్షలు ఇవ్వగా పని జరగకున్నా డబ్బు తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement