ఖమ్మంక్రైం: పెళ్లయి రెండున్న ర నెలలు దాటకముందే అనుమానంతో తరుచూ వేధించే భర్త, అత్త, మామల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య కు పాల్పడింది. టూటౌన్ సీఐ బాలకృష్ణ కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతం చిల్లకల్లుకు చెందిన నాగలీల, రామకృష్ణ దంపతుల కుమార్తె నాగలక్ష్మి(20)ని ఖమ్మంలోని రమణగుట్ట ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గుంజి నాగార్జునతో రెండున్నర నెలల క్రితం వివాహమైంది. అయితే వివాహం అయినప్పటి నుంచి నాగార్జున నాగలక్ష్మిపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. దీనికి తోడు అతడి తల్లి నాగమణి, తండ్రి నాగేశ్వరావులు కుమారుడికి వత్తాసు పలుకుతూ నాగలక్ష్మిని మరింత వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి పక్కన వారు కిటికీలో నుంచి చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యాన మృతదేహాన్ని పెద్దాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాగలక్ష్మి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆమె మెడలో పుస్తెలతాడు కనిపించలేదని బంధువులు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కొద్దిసేపు ఆందోళన చేశారు.
మనస్తాపంతో నవ వధువు ఆత్మహత్య


