కన్నబిడ్డను చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డను చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు..

Sep 21 2026 12:32 AM | Updated on Sep 21 2026 12:32 AM

టేకులపల్లి: ఇల్లెందు మండలం లచ్చగూడెం పంచాయతీ కొమ్ముగూడెం తండాకు చెందిన గుగులోతు మోహన్‌, ఉమా (30) దంపతుల కుటుంబంలో విషాదం నెలకొంది. బిడ్డను కలిసేందుకు వెళ్తున్న ఆ కుటుంబానికి తెలియకుండానే ఉమాకు చివరి ప్రయాణంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మోహన్‌, ఉమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె పూజ శ్రీ రామవరం ఏకలవ్య పాఠశాలలో ఏడో తరగతి, చిన్న కుమార్తె జైశ్రీ ఇల్లెందులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మోహన్‌ వ్యవసాయ పనులతో పాటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లచ్చగూడెం పంచాయతీ రెండో వార్డు సభ్యుడిగానూ కొనసాగుతున్నాడు. ఆదివా రం కావడంతో పెద్ద కుమార్తెను చూసేందుకు మోహన్‌, ఉమా దంపతులు తమ చిన్న కుమార్తె జైశ్రీని వెంట తీసుకుని బైక్‌పై రామవరం ఏకలవ్య పాఠశాలకు బయలుదేరారు. ఈక్రమాన టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా పంచాయతీ సాయనపేట సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన యాష్‌ ట్యాంకర్‌ లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మోహన్‌, చిన్న కుమార్తె జై శ్రీ రోడ్డు పక్కకు పడిపోగా, ఉమా రోడ్డుపై పడిపోగా లారీ టైర్ల మధ్యలో ఉమా చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందింది. కొద్ది సేపటి వరకు బిడ్డను పట్టుకుని రోదిస్తున్న మోహన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. భర్త కళ్లముందే భార్య ప్రాణాలు కోల్పోవడం, కుమార్తెకు గాయాలుకావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదా న్ని నింపింది. సమాచారం అందుకున్న టేకులపల్లి ఎస్సై తిరుపతి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టి పంచనామా నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన మోహన్‌, స్వల్ప గాయాలైన జైశ్రీని ఇల్లెందు ఆస్పత్రికి, ఆపై ఖమ్మం తరలించారు. ఉమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించి ఆపై కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆదివారం పూట కన్నబిడ్డను చూసేందుకు స్వీట్లు, తినుబండారాలు తీసుకుని ఆనందంగా బయలుదేరిన ఉమా.. తిరిగి ఇంటికి రాకుండానే అనంతలోకాలకు వెళ్లడం స్థానికులు, కుటుంబసభ్యులను కలచివేసింది. విషయం తెలుసుకున్న లచ్చగూడెం సర్పంచ్‌ జరుపుల లక్ష్మ ణ్‌, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు సహకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యాష్‌ ట్యాంకర్‌ ఢీకొని దుర్మరణం,

భర్త, కుమార్తెకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement