కార్పొరేషన్ల వారీగా
అందిన దరఖాస్తులు
ఆదేశాలు రాగానే అమలు
● వాయిదా పడిన పథకానికి మళ్లీ ఊపిరి ● నవంబర్ 19నుంచి రూ.లక్ష సాయంపై ప్రకటన ● ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షలకు పైగా దరఖాస్తులు
చుంచుపల్లి: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో మళ్లీ కదలిక వచ్చింది. గతంలో దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియ చేపట్టినా వివిధ కారణాలతో అమలు ముందుకు సాగలేదు. ఈక్రమాన నవంబర్ 19 నుంచి తొలి విడతగా రూ.లక్షలోపు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా అదికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లా యువతలో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. యువతకు ఆర్థిక సాయం అందించి సొంతంగా వ్యాపారం, స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, పశుపోషణ, చిన్న పరిశ్రమలు, సేవా రంగం, రవాణా తదితర విభాగాల్లో యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
గత ఏడాది మార్చిలో దరఖాస్తులు
2025 మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యవ వికాసం పథకానికి వివిధ వర్గాల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలో 95,325, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 64,882 కలిపి మొత్తంగా 1,60,207 దరఖాస్తులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ తదితర వర్గాల నుంచి యువత దరఖాస్తు చేసుకున్నారు.
రూ.50వేల నుంచి యూనిట్లు
రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాల ప్రకా రం స్వయం ఉపాధి యూనిట్ల స్థాయి ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణ సౌకర్యం, రాయితీ అమలవుతుంది. రూ.50వేల యూనిట్‌కు వంద శాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ. 2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో మొదటి విడతగా దాదాపు 38,230 యూనిట్ల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించగా.. దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తయినందున జాబితా ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి యూనిట్లకు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఏడాది కాలంగా వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం.. తాజాగా రూ.లక్ష వరకు సాయం కోసం దరఖా స్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. నవంబర్ 19 నుంచి తొలి విడత సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తుండగా.. అధికారిక మార్గదర్శకాలు వెలువడ్డాక మరింత స్పష్టత రానుంది.
కార్పొరేషన్ భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా
బీసీ 20,602 39,616
ఎస్సీ 12,488 29,742
ఎస్టీ 27,792 14,416
మైనార్టీ 2,844 7,412
ఈ బీసీ 1,049 4,022
క్రిస్టియన్ 107 117
మొత్తం 64,882 95,325
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ 19 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. గతంలో దరఖాస్తుల పరిశీలన మరింత లోతుగా చేపట్టాలనే నిర్ణయంతో వాయిదా వేసింది. యువ వికాసంపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. మార్గదర్శకాలు వెలువడగానే లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపడతాం. – బి.నాగలక్ష్మి,
భద్రాద్రి జిల్లా కోఆర్డినేటర్, రాజీవ్ యువ వికాసం


