2015లో భారీ రద్దీ, ప్రమాదాలు
● మరో తొమ్మిది నెలల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం ● భద్రాచలం వద్ద కోటి మంది స్నానమాచరిస్తారని అంచనా ● కొత్తవి నిర్మించకుండా పాతఘాట్లతోనే సరిపెడుతున్న ప్రభుత్వం ● 2015 తరహాలోనే 2027లోనూ భక్తులకు సౌకర్యాల లేమి తప్పదా?
భద్రాచలం: గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నాయి. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానం చేస్తారని, భద్రాచలానికే సుమారు కోటి మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తొలిదశలో రూ. 68.8 కోట్లతో పుష్కరాల పనులు చేపట్టారు. రెండో విడతలో రూ.26.46 కోట్లు విడుదల చేశారు. రెండు విడతల్లోనూ భద్రాచలంలో మినహా ఎక్కడా కొత్త ఘాట్ల నిర్మాణం చేపట్టడంలేదు.
42 లక్షల మందికే కిక్కిరిస్తే..
కోటి మంది వస్తే ఎలా..?
గత పుష్కరాలకు 8 ఘాట్లలో 42లక్షల మంది వస్తేనే భక్తులు కిక్కిరిసిపోయారు. ఈసారి కోటి మంది వస్తే ఘాట్లు సరిపోతాయా? సౌకర్యాల్లేక ఇబ్బందులు పడాల్సిందేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇతర చోట్ల కొత్త ఘాట్లు, డార్మెటరీ హాల్స్ నిర్మించకపోవడంపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాత ఘాట్లకు మరమ్మతులతోనే సరిపెట్టకుండా ప్రణాళిక రూపొందించి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మాత్రమే గోదావరి ఘాట్ విస్తరణ చేపడుతున్నారు. వీఐపీ ఘాట్‌గా పిలిచే బూర్గంపాడు మండల పరిధిలోని మోతె, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలలో కేవలం పాత ఘాట్లకు మరమ్మతులకు మాత్రమే నిధులు ఇచ్చారు. అయి తే లక్ష మంది భక్తులను క్లస్టర్‌గా తీసుకుని, ప్రతీ క్లస్టర్‌ను ప్రధాన ఘాట్లుగా విభజించి నిర్మాణం, వాటర్ షవర్లు ఏర్పాటు చేస్తే భక్తులకు ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.
ప్రణాళిక రూపొందించి.. ఆ ప్రకారం చేస్తే మేలు
గోదావరి పుష్కరాలు అంటే 12 ఏళ్లకోసారి వచ్చే మహాఆధ్యాత్మిక ఉత్సవం. భద్రగిరి రామయ్య సన్నిధిలో పుష్కార స్నానం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. అలాంటిది భఽద్రాచలం నియోజకవర్గంలో పుష్కరాలకు ముందస్తు మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేయాల్సి ఉండగా, కేవలం ౖపైపె పూతల పనులే చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఘాట్ల నిర్మాణం, పార్కింగ్, వసతి, వైద్య, పారిశుద్ధ్య, ట్రాఫిక్ వసతులను మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉంది. 12 రోజుల్లో భద్రాచలం వచ్చే భక్తులకు వసతి కల్పించటమే ప్రధాన సమస్య. దీనిని ఎదుర్కొనేందుకు తాత్కాలిక డార్మెటరీలు, పాఠశాలలు, కాలేజీలను తాత్కాలిక వసతి కేంద్రాలుగా మార్చడం, టెంట్ సిటీల ఏర్పాటు, కుటుంబాల కోసం ప్రత్యేక శిబిరాలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వసతి కల్పించాలి. ఇవన్నీ సక్రమంగా అందుబాటులోకి రావాలంటే గోదావరి పుష్కరాలు–2027 మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేయాల్సి ఉంది. అదే సమయంలో భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పుష్కర ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.
రాష్ట్రంలోనే భద్రాచలం గోదావరి ఘాట్ ప్రధాన పుష్కర ఘాట్‌గా ఉంటుంది. 2015లో పుష్కరాల ప్రారంభం రోజునే సుమారు 2లక్షల మంది పుష్క ర స్నానం ఆచరించినట్లు గణాంకాలు చెబు తున్నాయి. విపరీతమైన రద్దీతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాచలంలో ఘాట్ పరిధి బయట నదిలో స్నానం చేస్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు. రద్దీ నియంత్రణ, ట్రాఫిక్, క్యూలు, పార్కింగ్ సవాలుగా మారాయి.


