లేని పరిశ్రమ ఉన్నట్టుగా
చెబుతున్న కేంద్ర ప్రభుత్వం
ఏడు సంవత్సరాల క్రితం
పాల్వంచ స్పాంజ్ ఐరన్ మూత
ఇటీవల డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్‌పోర్ట్స్
హబ్ పథకం తెచ్చిన కేంద్రం
జిల్లా నుంచి స్పాంజ్ ఐరన్ ఎగుమతి చేయొచ్చని పేర్కొన్న వైనం
చెబితే వినరు.. చెప్పింది చేయరు !
మూతపడినా..
సాక్షి ప్రతినిధి, భద్రాది కొత్తగూడెం: పాల్వంచలో ఉన్న ఎన్‌ఎండీసీ స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో ఏడేళ్ల క్రితమే ఫర్నెస్‌లో వేడి చల్లారిపోయింది. కార్మికుల కోలాహలం కూడా ఆగిపోయింది. సైరన్ చప్పుడు లేక ఫ్యాక్టరీ క్యాంపస్ మూగపోయింది. కానీ కేంద్రం ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ మనుగడలోనే ఉంది. ఇక్కడ ఉత్పత్తి జరుగుతున్న స్పాంజ్ ఐరన్‌ను విదేశాలకు ఎగుమతి కూడా చేయొచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ నెల 2న కేంద్రం కొత్తగా చేపట్టిన డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్‌పోర్ట్స్ హబ్ పథకానికి సంబంధించిన నివేదికలో జిల్లా నుంచి స్పాంజ్ ఐరన్, మిర్చి, అటవీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయొచ్చని పేర్కొనడం గమనార్హం. దీంతో మరోసారి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ చర్చలోకి వచ్చింది.
ఏడేళ్లుగా మూతపడి
యునైటెడ్ నేషన్స్ డెవలప్‌ఎమెంట్ ప్రోగ్రాం కింద 1980లో దక్షిణాసియాలోనే మొదటిసారిగా కోల్ బేస్డ్ స్పాంజ్ ఐరన్ యూనిట్‌ను పాల్వంచలో నిర్మించారు. మొదటి యూనిట్ విజయవంతం కావడంతో 1985లో రెండో యూనిట్ అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ఆధారంగా 1993లో 7.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. అనంతరం పిగ్ ఐరన్ నుంచి స్పాంజ్ ఐరన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను 1997లో నిర్మించారు. ఇలా దశల వారీగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ సంస్థను 2010లో ఎన్‌ఎండీసీలో విలీనం చేశారు. ఆ తర్వాత నిర్వహణ లోపాల కారణంగా నష్టాల బారిన పడి 2016లో పూర్తిగా మూతపడింది. అనంతరం రాజకీయ ఒత్తిడితో స్పాంజ్ ఐరన్ ఇండియా, పాల్వంచ యూనిట్‌ను 2019 జనవరిలో ఎన్‌ఎండీసీ సంస్థ తిరిగి ప్రారంభించినా రెండు నెలలకు మించి నడవలేదు. చివరకు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా అవి కూడా ఫలప్రదం కాలేదు.
ఏదో ఒకటి తేల్చండి
స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం స్పందించడం లేదు. దీంతో జిల్లాలో పారిశ్రామిక వృద్ధి ఆగిపోయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. స్థానిక యువత ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సి వస్తోంది. శ్రామికులు, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయి స్థానిక వ్యాపారాలు నీరసించిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మొదటి ప్రాధాన్యతగా రికార్డుల్లో పేర్కొంటున్నట్టుగా స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. అది లాభసాటి వ్యవహారం కాదని తేలినప్పుడు రెండో ప్రాధాన్యతగా ఈ పరిశ్రమను మూసివేస్తున్నట్టుగా అధికారికంగా పేర్కొని, ఇక్కడున్న 423 ఎకరాల స్థలంలో కొత్త పరిశ్రమలు స్థాపించే విధంగా కార్యాచరణ రూపొందించాలి. ఈ ప్రాంగణంలో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుని కోల్డ్ రోలింగ్ మిల్ కాంప్లెక్స్, హాట్ రోలింగ్ మిల్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డెడ్ పైపుల పరిశ్రమ, సెమికండక్టర్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇథనాల్ ప్లాంట్, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టుగా ఇప్పటికే పలు స్వతంత్ర సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి.
ఏడాది క్రితం ఇటు రాష్ట్రం అటు కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తెరిపించే అంశంపై ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. 2024 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తిరిగి నడిపించాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. రెండోసారి 2025 జూలైలో కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి దృష్టికి రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు తీసుకెళ్లారు. పరిశ్రమను తిరిగి తెరిచేందుకు సాధ్యాసాధ్యలపై పరిశీలనకు నిపుణుల కమిటీ పంపిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది పూర్తయినా హామీ అమలుకు నోచుకోలేదు. మరోవైపు స్థానికబీజేపీ నేతలు సైతం ఈ అంశాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.


