నేత్రపర్వంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం

Sep 16 2026 3:37 AM | Updated on Sep 16 2026 3:37 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం రామయ్య నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీసేవగా మిథిలా స్టేడియంలోని శ్రీరామ సేవా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బస్తీ దవాఖానాల్లో తనిఖీ

ఇల్లెందు: ఇల్లెందులోని బస్తీ దవాఖానాలు, కొమరారం, రొంపేడు పీహెచ్‌సీలను డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ మంగళవారం తనిఖీ చేశారు. ప్రపంచ రోగి భద్రతా వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఎల్‌బీఎస్‌ నగర్‌, హమాలీ బస్తీలోని దవాఖానాలను సందర్శించారు. మలేరియా కిట్లు, మధుమేహం, రక్తపోటుకు సంబంధించిన మందుల నిల్వలు, వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కొమరారం పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ గర్భిణులతో సమావేశం నిర్వహించారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, పౌష్టికా హారం తీసుకోవాలని సూచించారు. రాబోవు మూడు నెలల ప్రసవ అంచనా తేదీల క్యాలెండర్‌ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. రొంపేడు పీహెచ్‌సీలో సిబ్బందికి రోగి భద్రతపై అవగాహన కల్పించారు.

రీ సర్వే పరిశీలన

మణుగూరు రూరల్‌: మండలంలోని అనంతారం గ్రామంలో కొనసాగుతున్న రెవెన్యూ రీ సర్వేను అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ మంగళవారం సందర్శించారు. భూముల మ్యాప్‌ను పరిశీలించి రీ సర్వే పురోగతి, భూ వివరాలు, వాటి నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. సర్వే పనులను పకడ్బందీగా చేపట్టా లని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసీల్దార్‌ అద్దంకి నరేష్‌, సర్వేయర్‌ నరేష్‌, ఆర్‌ఐ రమేష్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బోధనా నైపుణ్యం పెరగాలి

డీఈఓ వాసంతి

టేకులపల్లి: ఉపాధ్యాయులు బోధానా నైపుణ్యం పెంచుకోవాలని డీఈఓ వాసంతి అన్నా రు. మంగళవార ఆమె టేకులపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. బోధనా పద్ధతులు, రికార్డులను పరిశీలించారు. లోటుపాట్లను సరిదిద్దుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ తర్వాత వెంకట్యాతండా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. అధికారులు టి. మాధవరావు, సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి అల్లూరి రెడ్డి , ఎం.మోహన్‌ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement