డ్యామేజ్‌కు నో ఛాన్స్‌.. | - | Sakshi
Sakshi News home page

డ్యామేజ్‌కు నో ఛాన్స్‌..

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

తక్కువ ఖర్చుతో పట్టిష్ట నిర్మాణం..

64ఏళ్లుగా చెక్కుచెదరని కిన్నెరసాని డ్యామ్‌ వందేళ్ల పటిష్టత కోసం పదేళ్ల శ్రమ యంత్రాలు లేని సమయంలోనే కట్టడం నాటి ఇంజనీర్ల పనితీరుకు నిదర్శనంగా ప్రాజెక్టు

1961లో ప్రాజెక్టుకు తొలి అడుగు..

పాల్వంచ రూరల్‌: గత 64ఏళ్లుగా చెక్కుచెదరని పాల్వంచలోని కిన్నెరసాని డ్యామ్‌ పటిష్టతను చాటుతోంది. ఎంతో పటిష్టంగా వందేళ్ల పాటు ఉండాలనే ఉద్దేశంతో నాడు ఇంజనీర్లు తమ మేథోశక్తికి పదునుపెట్టి కార్మికులు, గుర్రాలు, గాడిదలు, ఎడ్లబండ్ల సాయంతో సామగ్రి తరలిస్తూ.. పదేళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టును నిర్మించారు. నాడు ఎటువంటి సౌకర్యాలు, అధునాతన పరికరాలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా దట్టమైన అరణ్యంలో రోడ్డు మార్గం లేక, యంత్రాలు, వాహనాల సాయం లేకున్నప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ వెలుగులు పంచే కేటీపీఎస్‌కు, ఎన్‌ఎండీసీ, నవభారత్‌ వంటి భారీ పరిశ్రమలకే కాక 10వేల ఎకరాలకు సాగునీరు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు తాగునీరు అందిస్తోంది. రేపు(మంగళవారం) నేషనల్‌ ఇంజినీర్స్‌ డే సందర్భంగా ప్రాజెక్టు వివరాలతో కథనం.

స్క్రాపర్లు, ఎడ్లబండ్లను వినియోగించి..

స్క్రాపర్లు, ఎడ్లబండ్లను వినియోగించి స్థానికంగా లభించిన రాళ్లు, ఇసుకతో తోగ్గూడెం నుంచి కంకరను తీసుకొచ్చి అధునాతన, నాణ్యమైన నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టులో ఏ క్రస్ట్‌ గేట్‌ను చూసిన సిమెంట్‌తో ప్లాస్టింగ్‌ చేసినట్లుగా కనిపించేలా నాడు సిమెంట్‌ను కలిపి రాళ్లతో నిర్మాణం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాజెక్టు పక్కనే గుట్టపైన 1970లో ప్రారంభించిన జలదృశ్యం విశ్రాంతి భవన నిర్మాణం 1971లో పూర్తయింది. దీన్ని నాటి ఏపీ ఇరిగేషన్‌శాఖ మంత్రి వి.పురుషోత్తమరెడ్డి ప్రారంభించారు. ఎటువంటి సాంకేతికత లేని సమయాన ఎండననక, వాననక పదేళ్ల పాటు ఐదు వేల మంది కార్మికులతో జంతువులను వినియోగించుకుంటూ పటిష్టంగా నిర్మాణం చేపట్టారని చూసిన చుట్టుపక్కల ప్రజలు తెలిపారు. కాగా, గత నెలలో ప్రాజెక్టుల భద్రత, స్థిరత్వం, సమర్థత పరిశీలన (సీడీఎస్‌ఈ) రామరాజు బృందం కూడా ప్రాజెక్టును పరిశీలించి వందేళ్ల వరకు ఎటువంటి ఢోకాలేదని కితాబు ఇవ్వడం విశేషం.

నేటి ఇంజనీర్లకు కిన్నెరసాని ప్రాజెక్టు పాఠంలా నిలుస్తుంది. ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా కిన్నెరసాని డ్యామ్‌ను తక్కువ ఖర్చుతో నిర్మించారు. వందేళ్ల వరకు ఇబ్బంది రాకుండా ప్రాజెక్టు గేట్ల కింద స్లూయిస్‌తో

నిర్మించారు. ఇటీవల పరిశీలించిన సీడీఎస్‌ఈ బృందం కూడా ఎంతో పటిష్టంగా ఉందని చెప్పింది.

– ప్రభాకర్‌రావు, చీఫ్‌ ఇంజనీర్‌, కేటీపీఎస్‌ 5వ దశ

రేపు నేషనల్‌ ఇంజినీర్స్‌ డే

పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలోని అడవి ప్రాంతంలో యానంబైల్‌ పంచాయతీ సమీపాన ఉన్న కిన్నెరసానివాగు ద్వారా వర్షం నీరు వృథాగా గోదావరిలో కలుస్తోంది. దీంతో ఆ నీటిని నిల్వ చేసి వినియోగించుకోవాలని నాటి ఇంజనీర్లు బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికితోడు థర్మల్‌పవర్‌ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు గునులు, అవసరమైన నీరు పాల్వంచ మండల పరిధిలో లభించడంతో 1961లో నాటి ఏపీఎస్‌ఈబీ సంస్థ రూ.5.58 కోట్ల వ్యయంతో కిన్నెరసానివాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రాజెక్టు పనులను ఇరిగేషన్‌ శాఖకు అప్పగించారు. దీంతో ఆ శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్‌ రామకృష్ణరాజు నేతృత్వాన పది మంది ఇంజనీర్లు 13 క్రస్ట్‌ గేట్లతో చిన్నకాలువపైన 1962 నుంచి 1972 వరకు శ్రమించి రెండు దశల్లో ప్రాజెక్టు పనులు పూర్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement