కరకగూడెం: వినాయక చవితి అంటే భారీ విగ్రహాలు, రంగురంగుల అలంకరణలు గుర్తుకొస్తాయి. కానీ కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధి కుర్నవల్లికి చెందిన వైఆర్‌ఎస్ యూత్ ఆధ్వర్యాన విఘ్నేశ్వర కమిటీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆరేళ్లుగా స్వచ్ఛమైన మట్టితో సొంతంగా విగ్రహాన్ని తయారుచేసి ఉత్సవాలు నిర్వహిస్తుండడం విశేషం. మట్టి ఎంపిక మొదలు విగ్రహానికి రూపం ఇవ్వడం, రంగులు వేయడం వరకు కమిటీ సభ్యులే చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ బాధ్యుడు మిద్దబోయిన ప్రశాంత్ మాట్లాడుతూ ఆరేళ్లుగా మట్టితోనే వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకున్న మట్టితో వినాయకుడిని తయారు చేసి.. తిరిగి ప్రకృతిలోనే కలుపుతూ.. మరికొందరికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.


