● విపక్షాలను ఐక్యం చేయడంలో సీతారాం దిట్ట ● ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణకు ఏకం కావాలి ● వర్ధంతి సభలో ‘న్యూస్‌క్లిక్’ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో ప్రజాస్వామ్య హక్కులకు భంగం వాటిల్లుతున్న ప్రస్తుత సమయాన సీపీఎం పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికంగా లేకపోవడం తీరని లోటని సీనియర్ జర్నలిస్ట్, న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ పేర్కొన్నారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఏచూరి రెండో వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నివాళులర్పించాక ‘భారత ప్రజాస్వామ్యం–సవాళ్లు’ అంశంపై జరిగిన సెమినార్‌లో ప్రబీర్ పుర్కాయస్థ కీలకోపన్యాసం చేశారు. వివిధ రాజకీయ భావజాలాలు కలిగిన శక్తులను ఒకే వేదికపైకి తీసుకురాగల అరుదైన నాయకత్వ పటిమ, ప్రజా సంబంధాలు ఏచూరి సొంతమని కొనియాడారు. ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడితే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తెలిపారు. ఎమర్జెన్సీ సమయాన జైలు శిక్ష అనుభవించిన నాటి రాజకీయ అనుభవాలను వివరిస్తూ... స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ హక్కుల ప్రాధాన్యతను అప్పుడే గ్రహించామని చెప్పారు. నాటి ఎమర్జెన్సీ తరహా సవాళ్లే నేడు మళ్లీ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్నందున ప్రతీ తరం హక్కుల కోసం పోరాడక తప్పదని స్పష్టం చేశారు.
ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో తీవ్రమైన అక్రమాలు జరుగుతున్నాయని ప్రబీర్ ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 25 – 30 శాతం మంది పౌరులు ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతీ పోలింగ్ బూత్ వద్ద ప్రజాస్వామ్య శక్తులు పర్యవేక్షిస్తూ ప్రజల ఓటు హక్కు కాపాడాల్సిన అవసరముందని తెలిపారు. జెన్ జీ విద్యార్థులు హాస్యం, సృజనాత్మకతను మేళవించి పాలకులను నిలదీస్తున్న తీరును అభినందించారు. కాగా, దేశంలోని విభిన్న వర్గాలు ఏకమై స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల వ్యవస్థ కోసం, పౌర హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడాలని పుర్కాయస్థ పిలుపునిచ్చారు. ఇంకా ఈ సభలో సీపీఎం కేంద్రం కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, పి.సోమయ్య, పొన్నం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, హిమబిందు, ఆనందాచారి, మాచర్ల భారతి, వై.విక్రమ్, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్దన్, ఆవునూరి మధు తదితరులు పాల్గొన్నారు.


