భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మూలమూర్తులకు ఆదివారం అంతర్గతంగా అభిషేకం జరిపారు. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవామండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
గోదావరి మాతకు నదీహారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని కరకట్ట వద్ద ఆదివారం సాయంత్రం గోదావరి మాతకు నదీహారతి సమర్పించారు. భద్రాద్రి పురోహితుల సంఘం ఆధ్వర్యాన జరిగిన వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై దీపకాంతుల నడుమ సాగిన హారతిని వీక్షించారు. సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్ ఆధ్వర్యానతొలుత గణపతి పూజ నిర్వహించి శ్రీ సీతారామచంద్రస్వామి, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన చేశారు. ఈకార్యక్రమంలో చంద్రశేఖరశర్మ, రామాచార్యులు, తేజాశర్మ, తిరుపతిరావు, రిషి, సత్యనారాయణరెడ్డి, నరసింహశర్మ పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
విశేష పూజలు
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. సెలవు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలిరాగా, అర్చకులు పూజలు చేశారు. పలువురు భక్తులు తమ పిల్ల లకు అన్నప్రాసన జరిపించగా ఒడిబియ్యం, చీరసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల్లో ఈఓ విజయ్‌కుమార్, వేదపండితులు, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ బంక్‌లో
రూ.29.39 లక్షల గోల్‌మాల్!
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని జియో పెట్రోల్ బంక్‌లో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది. విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు సూపర్‌వైజర్లు రూ.29,39,822 మేర అవకతవకలకు పాల్పడ్డారని బంక్ యజమాని తావుర్యా ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా బంకు లావాదేవీల్లో తేడాలు వస్తుండగా ఈనెల 10వ తేదీన రికార్డులు పరిశీలించారు. ఆతర్వాత రంగంలోకి దిగిన జియో ప్రతినిధులు బంకులో ఆడిట్ చేపట్టారు. ప్రతిరోజు ఉదయం టెస్టింగ్ కోసం తీసే పెట్రోల్, డీజిల్‌ను తిరిగి ట్యాంకుల్లో పోయకుండా సిబ్బంది బయట విక్రయిస్తున్నట్లు తేలింది. తద్వారా ఆరు నెలల్లో సుమారు 10,500 లీటర్ల పెట్రోల్, 7,600 లీటర్ల డీజిల్‌ను అమ్ముకుని వచ్చిన రూ.29.39 లక్షలను సొంతానికి వాడుకున్నట్లు తేల్చారు. ఈమేరకు ముగ్గురిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


