చివరి దశకు చేరిన
రూ. 2.32 కోట్ల విలువైన పనులు
మరో రూ.3కోట్లతో పనులు చేపట్టేలా ప్రణాళిక
అన్నీ పూర్తయితే ఆస్పత్రికి కొత్తరూపు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రి కొంత రూపు సంతరించుకోనుంది. సమృద్ధిగా నిధులు సమకూరుతుండడంతో మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. కలెక్టర్ దివాకర చొరవ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సహకారంతో పెద్దాస్పత్రిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం సుడా(స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) నిధులు కేటాయించడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ పనులు తుది దశకు చేరగా.. మరికొన్ని కూడా చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
హెచ్‌డీఎస్ నిధుల లేమితో...
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి నిత్యం 1,200 – 1,500 మంది వైద్య సేవలకు వస్తున్నారు. అలాగే ఇన్‌పేషంట్ల తాకిడి కూడా ఉంటోంది. ఇక సీజనల్ సమయాన ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అయితే, జనానికి తగినట్లు సౌకర్యాలు లేకపోగా.. హెచ్‌డీఎస్ నిధుల లేమితో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈక్రమాన కలెక్టర్ దివాకర, కేఎంసీ కమిషనర్ అభిషేక్ ప్రత్యేక దృష్టితో ‘సుడా’ నిధులు కేటాయించారు. గత ఏడాది నుంచి రూ.2.32 కోట్లు వెచ్చించగా ఈ నిధులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. ఎంసీహెచ్, జనరల్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, లేబర్ రూంల ఆధునికీకరణ పనులను రూ.14.90 లక్షలతో పూర్తి చేశారు. అలాగే రూ.30 లక్షలతో దివ్యాంగులకు సదరమ్ వెయిటింగ్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక రూ.40లక్షల వ్యయంతో సంప్, రూ.7.95 లక్షలతో టాయిలెట్లు నిర్మించడమేకాక రూ. 33.50 లక్షలతో పాత టాయిలెట్లను ఆధునికీకరించారు. అంతేకాక రూ. 33.30 లక్షలతో ఇతర పనులు చేపడుతుండంతో పాటు రూ.49 లక్షలతో ఆస్పత్రి ఆవరణలో బీటీ రోడ్డు నిర్మించారు. అలాగే, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 21.25 లక్షలు, ఫైర్ సేప్టీ పనులకు రూ.2లక్షలు కేటాయించారు.
మరికొన్ని కూడా...
తొలి దశలో ‘సుడా’ నిధులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరడంతో మరికొన్ని పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. ఈక్రమాన అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్, కేఎంసీ కమిషనర్ సానుకూలంగా స్పందించి ‘సుడా’ నిధులు కేటాయించాలని నిర్ణయించారు. రూ.3.08 కోట్లతో చేపట్టే పనులకు టెండర్ల ప్రక్రియపై దృష్టి సారించారు. ఈ నిధులతో పాత ఓపీ భవనంలో దెబ్బతిన్న నీటి పైప్‌లైన్ల మార్పిడి, పైకప్పు మరమ్మతులు, ఆపరేషన్ థియేటర్, హెచ్‌ఓడీ బ్లాక్‌ల ఆధునికీకరణ, లిఫ్ట్ ఏర్పాటు పనులు జరగనున్నాయి.


