బెట్టింగ్‌ గుట్టు రట్టయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ గుట్టు రట్టయ్యేనా?

Sep 9 2026 12:53 AM | Updated on Sep 9 2026 12:53 AM

● ఉద్యోగాల పేరిట వసూళ్ల కేసులో ఎమ్మెల్యే పీఏ అరెస్టుతో సరి! ● రూ.8కోట్ల రికవరీపై అస్పష్టత

ఆటో తాకట్టు పెట్టి ఇచ్చా..

● ఉద్యోగాల పేరిట వసూళ్ల కేసులో ఎమ్మెల్యే పీఏ అరెస్టుతో సరి! ● రూ.8కోట్ల రికవరీపై అస్పష్టత

భద్రాచలంఅర్బన్‌: ఉద్యోగాల ఆశ చూపి 54 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కోర్ల కళ్యాణ్‌కుమార్‌ వ్యవహారంలో అసలు గుట్టు ఎప్పుడు రట్టవుతుందన్న ప్రశ్నకు సమాధానం లభించడంలేదు. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, బూర్గంపాడు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేయగా.. పోలీసులు దర్యాప్తు అనంతరం కళ్యాణ్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే, విచారణలో ఆయన సొమ్మంతా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు చెప్పాడని పోలీసులు ప్రకటించినా.. అది నిజమేనా, కాదా అన్నది తేలాల్సి ఉంది. ఏయే ఖాతాల ద్వారా బెట్టింగ్‌కు మళ్లించాడు, ఎంత పోగొట్టుకున్నాడు, ఏయే ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయో విచారించకుండా ఆయన అరెస్టుతోనే సరిపెడతారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

ఇంకా ఎవరు ఉన్నారు?

రూ.8 కోట్ల మేర వసూళ్ల పర్వం కళ్యాణ్‌కుమార్‌ ఒక్కడితోనే సాగిందా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపడితే వివరాలు వెల్లడి కానున్నాయి. అంతేకాక కళ్యాణ్‌కుమార్‌ రెవెన్యూ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌ కాగా, భద్రాచలం ఎమ్మెల్యే పీఏగా విధులు నిర్వర్తించిన సమయాన వసూళ్లకు పాల్పడ్డాడు. అయితే, పోలీసులు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో రెవెన్యూ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌గా పేర్కొని ఎమ్మెల్యే పీఏ హోదాను ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, ఉద్యోగాల ఆశతో డబ్బు చెల్లించిన బాధితులు రికవరీపై ఆశ పెట్టుకున్నారు. ‘వసూలు చేశాడు.. బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు’ అన్నట్లు ముగించకుండా సొమ్ము రికవరీ చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని వారు చెబుతున్నారు. ఈవిషయంలో పోలీసులు తీసుకునే చర్యలపై అందరూ ఎదురుచూస్తున్నారు.

నా కొడుక్కి ఉద్యోగం వస్తుందని ఆశతో ఆటోను తాకట్టు పెట్టడమే కాక అప్పు చేసి మరీ కళ్యాణ్‌కు రూ.10 లక్షలు ఇచ్చాను. చివరకు ఉద్యోగం రాకపోగా, డబ్బూ తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ డబ్బంతా బెట్టింగ్‌లో పోయిందని చెప్పాడని తెలియడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఎవరి మీద కక్ష లేదు.. డబ్బు తిరిగి వస్తే చాలు. పోలీసులు రికవరీ చేపట్టి మాకు న్యాయం చేయాలి. – రాయల శ్రీను,

బాధితుడు, ఆటో డ్రైవర్‌, భద్రాచలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement