ఇంటి ముందే ప్రమాదం.. డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఇంటి ముందే ప్రమాదం.. డ్రైవర్‌ మృతి

Sep 9 2026 12:53 AM | Updated on Sep 9 2026 12:53 AM

చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. తిప్పనపల్లికి చెందిన లారీ డ్రైవర్‌ ఎస్‌.కే.ముస్తఫా(50) చండ్రుగొండకు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈక్రమాన నిమిషమైతే ఇంట్లోకి వెళ్తాడనగా ఆయన బైక్‌ను కొత్తగూడెం నుంచి చండ్రుగొండ వైపు వేగంగా వస్తున్న ప్యాసింజర్‌ ఆటో ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ముస్తఫా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చికిత్స పొందుతున్న డ్రైవర్‌..

జూలూరుపాడు(సుజాతనగర్‌): రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా.. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంకు చెందిన భూక్యా భద్రు(48) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన సోమవారం ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి సుజాతనగర్‌ వెళ్లాడు. సుజాతనగర్‌లోని నాయక్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టగా తీవ్రగాయాలు కావడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య భారతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కల్యాణి తెలిపారు.

బళ్లారిలో బాంబు పేలి..

పాల్వంచ వాసి మృతి

పాల్వంచ: పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిన ఓ యువకుడిని ప్రమాదం బలి తీసుకుంది. పనిచేసే ప్రదేశంలో బాంబు పేలడంతో ఆయన మృతి చెందాడు. పాల్వంచ పరిధి బంగారుజాల గ్రామానికి చెందిన వజ్జ పూర్ణ(25) పాత పాల్వంచకు చెందిన నర్సయ్య కాంట్రాక్టర్‌ ద్వారా మరికొందరితో కలిసి కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని స్పాంజ్‌ ఐరన్‌ యూనిట్‌లో షట్‌డౌన్‌ పనుల నిమిత్తం వెళ్లాడు. యూనిట్‌ కిలన్‌లో బాంబ్‌ అమర్చగా, అది పేలకకపోవడంతో సరిచేసేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పేలింది. ఈ ధాటికి పూర్ణకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందగా.. యాదగిరికి గాయాలయ్యాయి. ఉపాధి కోసం వెళ్లి మృతి చెందాడనే సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ బళ్లారికి బయలుదేరారు. కాగా, పూర్ణకు భార్య భువనేశ్వరి, ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement