ములకలపల్లి: ఎంబీబీఎస్ చదవాలన్న నిరుపేద గిరిజన విద్యార్థి కల సాకారమైంది. ఐటీడీఏ పీఓ రాహుల్‌తో పాటు దాతల సహకారంతో ఆయన చివరి రోజైన మంగళవారం ఫీజు చెల్లించడంతో మెడికల్ కాలేజీలో సీటు దక్కింది. ములకలపల్లి మండలంలోని టేకులగుంపు గ్రామానికి చెందిన నక్కా సంతోష్ తండ్రి భాస్కర్ చిన్నతనంలోనే చనిపోగా, తల్లి వెంకటమ్మ పదో తరగతిలో మృతి చెందింది. అమ్మమ్మ వద్ద ఉంటూ ఇంటర్ పూర్తి చేసిన ఆయన కూలీ పనులు చేస్తూనే నీట్ రాశాడు. ఈమేరకు ఎస్టీ కోటాలో 4,750 ర్యాంక్ సాధించిన సంతోష్‌కు దుండిగల్‌లోని అరుంధతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. అయితే, ట్యూషన్ ఫీజు రూ.60 వేలు, సెక్యూరిటీ డిపాజిట్ రూ.40 వేలతో పాటు హాస్టల్ ఫీజు చెల్లించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆవేదన చెందాడు. ఈమేరకు సంతోష్ పరిస్థితిపై ‘సంతోష’ం నిలపండి’శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. దీంతో విషయం ఐటీడీఏ పీఓ రాహుల్ దృష్టికి వెళ్లగా భద్రాచలం ఆదివాసీ ఐక్య సంఘం(బీఏసీ) ఆధ్వర్యాన సోమవారం పీఓను కలిశాడు. పీఓ రాహుల్ ఐటీడీఏ నుంచి తక్షణసాయంగా రూ.60 చెక్కు ఇవ్వడమే కాక నాయకులు తెల్లం రమణయ్య, కుంజా ధర్మ, కోండ్రు సుధారాణితోపాటు పలువురు నాయకులు, దాతలు, ఐటీడీఏ ఉద్యోగులు కలిసి మరో రూ.60 వేలు ఆర్థికసాయం అందజేశారు. అలాగే, ములకలపల్లివాసి, వైరా ఎస్సై పుష్పాల రామారావు చొరవతో ఖమ్మంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయడు కొంగర పురుషోత్తం రూ.10 వేలు అంందించగా, సంతోష్ మంగళవారం మెడికల్ కళాశాలలో ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందాడు. ఈసందర్భంగా ఐటీడీఏ పీఓతో పాటు దాతలకు సంతోష్ కృతజ్ఞతలు తెలిపాడు.
సంతోష్‌కు ఐటీడీఏతో
పాటు దాతల చేయూత


