అశ్వారావుపేటరూరల్: ఆయిల్‌ఫెడ్ నర్సరీల్లో పెంచుతున్న పామాయిల్ మొక్కలను శనివారం పీఈ క్యూ(పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్) అధికారుల బృందం తనిఖీలు చేసింది. మండలంలోని నారంవారిగూడెం వద్దగల ఆయిల్‌ఫెడ్ నర్సరీ, దమ్మపేట మండలం అప్పారావుపేట నర్సరీల్లో మొక్కలను పరిశీ లించారు. నారంవారిగూడెం నర్సరీలోని మూడు కన్‌సైన్‌మెంట్లలో పెంచుతున్న 2,25,000, అప్పారావుపేట నర్సరీలోని రెండు కన్‌సైన్‌మెంట్లలో 75,000 మొక్కలను రెండో దశ తనిఖీలు చేశారు. మొక్కల ఎదుగుదల, పాటిస్తున్న జాగ్రత్తలను పరి శీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వచ్చే నెలలో తృతీయ దశ తనిఖీలు నిర్వహించిన తర్వాత రైతులకు పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. మొక్కల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులు ముందుగానే పొలాల్లో గుంతలు తవ్వుకోవాలని, ఎల్‌నినో నేపథ్యంలో ముందే డ్రిప్ పరికరాలను సిద్దం చేసుకోవాలని స్థానిక ఆయిల్‌ఫెడ్ డీవో ఎస్ శంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఈ క్యూ బృందం అధికారులు డాక్టర్ బి పుష్పవతి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు రామ్‌కుమార్, వెంకట రెడ్డి, నర్సరీ ఇంఛార్జిలు బీ మహేష్, బి ముద్దు కృష్ణ పాల్గొన్నారు.


