జిల్లాలో చేయూత
పింఛన్ల వివరాలు
దరఖాస్తు చేసుకోవాలి
● కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ● వృద్ధులు, బీడీ కార్మికులకు మొండిచేయి చూపడంతో ఆవేదన ● జిల్లాలో ఇప్పటికే 1.13 లక్షల మందికి పింఛన్లు
చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో ఈ నెల 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 31 వరకు కొనసాగనుంది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులతో పాటు కొత్తగా తలసేమి యా, సికిల్‌సెల్, హిమోఫీలియా బాధితులకు ప్రా ధాన్యం ఇవ్వనున్నట్లు తెలపగా, వృద్ధులకు బీడీ కార్మికులకు మొండిచేయి చూపింది. జిల్లాలో 57 ఏళ్లు దాటిన వందల మంది వృద్ధులు దరఖాస్తులు సమర్పించి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారికీ ఇప్పటికీ పింఛన్లు మంజూరు కాలేదు.
కొత్తగా దరఖాస్తు కోసం..
జిల్లా వ్యాప్తంగా 1,13,840 మంది చేయూత పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులకు, ఇతర వర్గాలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.4,016 చేయూత ఫించన్ ఇస్తున్నారు. ఈసారి తలసేమియా, సికిల్‌సెల్ బాధితులకు అవకాశం కల్పించనుండగా, జిల్లాలో తలసేమియా బాధితులు 85, సికిల్‌సెల్ బాధితులు 135 మంది ఉన్నట్లు తేలింది.
దరఖాస్తు ఇలా..
కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు చేయూత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. వివరాలను పూర్తిచేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలి. పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు లేదా పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులను అందజేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. కాగా, వచ్చే 1 నుంచి దరఖాస్తులపై విచారణ జరపనున్నట్లు అధికారులు తెలిపారు.
అర్హతలు..
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు కుటుంబ వార్షికాదాయం కలిగిన వారు అర్హులు. కుటుంబానికి మూడెకరాలకు మించి మాగాణి భూమి, 7.5 ఎకరాలకు మంచి మెట్ట భూమి ఉన్నా అర్హులు కారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేట్, వృత్తి నిపుణులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నా ఆ కుటుంబంలోని వారిని సైతం రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా పరిగణించనుంది. కుటుంబంలోని వ్యక్తికి సొంతంగా రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, కారు ఇతర ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నా పింఛన్‌కు అనర్హులని నిబంధనలను విధించింది.
విభాగం లబ్ధిదారులు
వృద్ధాప్య 42820
దివ్యాంగులు 13101
వితంతువులు 49369
ఏఆర్‌టీ బాధితులు 1791
ఒంటరి మహిళలు 6150
డయాలసిస్ బాధితులు 249
పైలేరియా బాధితులు 159
గీత కార్మికులు 141
చేనేత కార్మికులు 16
బీడీ కార్మికులు 04
అర్హులైనవారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 1 నుంచి విచారణ నిర్వహిస్తాం. అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం.
–ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ


