టేకులపల్లి: పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ వెంకన్న బాబు టేకులపల్లి సర్కిల్ ఆఫీస్‌లో బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవా రం టేకులపల్లి ఎస్‌ఐ తిరుపతి, సిబ్బందితో కలిసి వెంకట్యాతండా సమీపంలో నర్సాయిగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ద్విచక్రవాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 9.520 కిలోల గంజాయి లభించింది. దీంతో గంజాయి, వాహనం, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విచారించగా ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు తేలింది. నిందితుడు టపాన్ మండల్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, పట్టుబడిన గంజాయి విలువ రూ. 4,76,000 ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఎస్‌ఐ, సిబ్బందికి రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో సీఐ బి.సత్యనారాయణ, టేకులపల్లి, బోడు ఎస్‌ఐలు కె.తిరుపతి, రాజమౌళి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రెండు ప్రమాదాల్లో
ఇద్దరికి తీవ్ర గాయాలు
టేకులపల్లి: మండలంలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని ఎర్రాయిగూడెం పంచాయతీ చింతలకట్ట గ్రామానికి చెందిన యువకుడు చింత ప్రవీణ్ బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా కేఓసీ నుంచి వస్తున్న బొగ్గు లారీ బైక్‌ని ఢీకొట్టింది. దీంతో ప్రవీణ్ బైక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగూడెం తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కోయగూడెం పంచాయతీ దంతెలతండాకు చెందిన బోడ శ్రీకాంత్ తన బైక్‌పై పొలానికి వెళ్తుండగా గ్రామశివారలో ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకుపోయి విద్యుత్ స్తంభాన్ని తగిలి ఆగింది. ఆటోలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ద్విచక్రవాహనరుడికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించి చికిత్స అందిస్తున్నారు. మండలం పరిధిలోని చింతలంక పంచాయతీ రాజుతండా సెంటర్ వద్ద లారీ – బొలెరో ఢీకొన్న మరో ఘటనలో బొలెరో వాహనం బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఉద్యోగం
ఇప్పిస్తానంటూ మోసం
పాల్వంచ: హెవీ వాటర్ ప్లాంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని జయమ్మ కాలనీకి చెందిన నూనావత్ వాసుకు అశ్వాపురం హవీ వాటర్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకోసం రూ.3 లక్షలు ఇవ్వాలని వనమా కాలనీకి చెందిన భూక్యా అశోక్ అనే వ్యక్తి నమ్మబలికాడు. ముందుగా రూ.50 వేలు ఇవ్వాలని, వారం తర్వాత రూ. 2.50 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. దీంతో వాసు రూ.50 వేలు ఫోన్‌పే ద్వారా గత ఏడాది మేనెలలో ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం రాకపోగా, నగదు కూడా తిరిగి ఇవ్వలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అదృశ్యం
పాల్వంచరూరల్: వ్యక్తి అదృశ్యంపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న లకావత్ నర్సింహా గత నెల 15న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్య సెల్ నుంచి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఇతరుల ఫోన్ నుంచి చేస్తే వరంగల్‌లో ఉన్నట్లు తెలిపాడు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకుల ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


