కక్ష గట్టి కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

కక్ష గట్టి కత్తితో దాడి

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

● బాధితుడికి తీవ్రగాయాలు, కేసు నమోదు ● గతంలో బాధితుడి కూతురిపై వేధింపులు ● పోలీసులకు ఫిర్యాదు చేశాడని యువకుడి ఘాతుకం

● బాధితుడికి తీవ్రగాయాలు, కేసు నమోదు ● గతంలో బాధితుడి కూతురిపై వేధింపులు ● పోలీసులకు ఫిర్యాదు చేశాడని యువకుడి ఘాతుకం

దుమ్ముగూడెం: తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కక్షతో ఓ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఒకరిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన దుమ్ముగూడెంలో మంగళవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకా రం.. దుమ్ముగూడెం గ్రామానికి చెందిన బాలికను లక్ష్మీనగరం గ్రామానికి చెందిన బాలుడు ఉప్పాడ హర్షత్‌రెడ్డి వెంట పడి ఇబ్బంది పెట్టాడు. దీంతో బాలిక తండ్రి, వెలుగు సీసీ గౌరారపు నర్సింహారా వు నాలుగు నెలల క్రితం పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. హర్షత్‌రెడ్డి మైనర్‌ కావడంతో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయితే ఇటీవల మైనారిటీ తీరిన, కక్ష పెంచుకున్న హర్షత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి నర్సింహారావుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానంటూ అతని కుమారుడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడిని బైక్‌పై లక్ష్మీనగరం ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. తిరిగి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో ఇరుగుపొరుగు మేల్కొనడంతో బైక్‌తోపాటు బాధితుడిని దుమ్ముగూడెం స్కూల్‌ దగ్గరలో వదిలేసి హర్షత్‌రెడ్డి పరారయ్యాడు. అనంతరం గ్రామస్తుల సహకారంతో కుటుంబసభ్యులు ములకపాడు వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్యామ్‌ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో హర్షత్‌రెడ్డి ఒక్కడే పాల్గొన్నాడా..? మరెవరైనా ఉన్నారా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. క్షతగాత్రుడిని ఓడబలిజ సంఘం నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నాలుగు నెలల క్రితమే పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష వేయాలని భద్రాచలం డివిజన్‌ టీఎన్జీఓ ఉద్యోగులు డీఎస్పీ అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement