సీనియర్లకే అవకాశం
పీఏసీఎస్‌లకు తొలిసారి నామినేటెడ్ సారథులు
త్వరలోనే చైర్మన్,
డైరెక్టర్ల పదవుల భర్తీ
పార్టీ విధేయుల జాబితాపై ఎమ్మెల్యేల కసరత్తు
పదవులు దక్కించుకునే ప్రయత్నాల్లో ఆశావహులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేటెడ్ ప్రాతిపదికన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) పాలకవర్గాలు త్వరలో కొలువుదీరబోతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులన్నీ నామినేటెడ్ విధానంలో కాంగ్రెస్ విధేయులకు అప్పగించనున్నారు. ఈ మేరకు ఆశావహుల జాబితా సిద్ధం చేయాలని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నేపథ్యాన ఎమ్మెల్యేలు తమ పరిధి పీఏసీఎస్‌ల్లో పదవులు ఆశిస్తున్న నేతలపై ఆరా తీస్తుండగా.. ఆశావహులు జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. తొలిసారి పీఏసీఎస్ పదవులను నామినేటెడ్ విధానంలో భర్తీ చేయనుండడంతో అధికార పార్టీలో హడావుడి మొదలైంది.
పీఏసీఎస్ టు డీసీసీబీ..
జిల్లాలోని పీఏసీఎస్‌లకు చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల కాలపరిమితి ఐదేళ్లు కాగా, 2020లో డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికై న కూరాకుల నాగభూషణంను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తప్పించింది. 2024 జనవరిలో వైస్ చైర్మన్‌గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావును చైర్మన్‌గా నియమించారు. ఆతర్వాత 2025 డిసెంబర్ 19తో డీసీసీబీ పదవీకాలం పూర్తయింది. అనంతరం ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు పొడిగించి చివరకు పాలకవర్గాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం డీసీసీబీకి పర్సన్ ఇన్‌చార్జ్‌గా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇక పీఏసీఎస్‌ల పదవీ కాలం ఐదేళ్లకు ముగిసినా ఎన్నికలు జరిగే వరకు తమనే కొనసాగించాలని పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో వారు కొనసాగుతున్నా, పది రోజుల్లో గడువు ముగియనున్నట్లు సమాచారం.
అంతా నామినేటెడే...
పీఏసీఎస్‌లతో పాటు డీసీసీబీ పాలకవర్గాన్ని సైతం నామినేటెడ్ పద్దతిన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో పీఏసీఎస్‌ల్లో సభ్యులైన రైతులు డైరెక్టర్లను ఎన్నుకున్నాక.. వారిలో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగేది. ఇక సొసైటీల చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను.. ఆపై డైరెక్టర్లలో చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఎన్నుకునే విధానం ఉండేది. ప్రభుత్వం దీనికి స్వస్తి పలికి పీఏసీఎస్‌ల నుంచి డీసీసీబీ వరకు పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలో నియమించాలని భావిస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్‌తో సహా డీసీసీబీకి మొత్తం 22 మంది డైరెక్టర్లు ఉంటారు.
సుమారు 5లక్షల మంది రైతులు పీఏసీఎస్‌ల్లో సభ్యులుగా ఉండడంతో చైర్మన్ పదవులను నామినేటెడ్ పద్దతిన భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఇదే సమయాన ఆశావవహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎంపిక చేయడం జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారనుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. 2023 ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన వారు కాకుండా గత కొన్నేళ్లుగా పార్టీకి విధేయులుగా ఉంటూ.. పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


