పినపాక/మణుగూరు రూరల్: పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రను గురువారం ఆయన మండల పరిధిలోని బయ్యారం క్రాస్ రోడ్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పోడు సమస్యను పరిష్కరించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. అనంతరం మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మణుగూరు మండల పరిధిలోని రామానుజవరంలో సీపీఐ నేత బొల్లోజు అయోధ్యాచారి స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. ప్రజా ఉద్యమాల్లో విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, ముత్యాల విశ్వనాథం, కమటం వెంకటేశ్వరరావు, కల్లూరు వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మీకుమారి, వై.రాంగోపాల్, తోగాటి కుమార్, గడ్డం మనోహర్ ఆచారి, పత్తిపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజా చైతన్య యాత్రలో ఎమ్మెల్యే కూనంనేని


