కమనీయం.. రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రామయ్య కల్యాణం

Oct 4 2026 9:43 AM | Updated on Oct 4 2026 9:43 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలు త తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

నేడు అథ్లెటిక్స్‌ ఎంపికలు

రుద్రంపూర్‌: జూనియర్స్‌ విభాగంలో జిల్లా అథ్లెటిక్స్‌ జట్ల ఎంపికకు ఆదివారం పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ కోచ్‌ డి.మల్లికార్జున్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 11 నుంచి కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. అండర్‌–14, 16 బాలబాలికల విభాగాల్లో జట్లను ఎంపిక చేస్తామని, అర్హులు పుట్టినరోజు ధ్రువపత్రం, ఎస్సెస్సీ మెమోతో హాజరుకావాలని సూచించారు.

సమన్వయంతో పనిచేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులు, నాన్‌బెయిలబుల్‌ వారెంట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించి, సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశించారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం కోర్టు డ్యూటీ అధికారులతో కోర్టు కేసుల పురోగతి, పెండింగ్‌ అంశాలు, కేసుల పరిష్కారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించిన ప్రొటెస్ట్‌ పిటిషన్లను సక్రమంగా పర్యవేక్షించాలన్నారు. ఈ–ఎఫ్‌ఐఆర్‌, ఈ–చార్జ్‌షీట్లకు సంబంధించిన వివరాలను కోర్టు డ్యూటీ అధికారులు కోర్టుల్లో సక్రమంగా పరిశీలించాలని చెప్పారు. డీసీఆర్‌బీ సీఐ రాజు, రాఘవయ్య పాల్గొన్నారు.

11 నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు

పాల్వంచరూరల్‌: మండల పరిధిలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రచార వాల్‌పోస్టర్లను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఈఓ విజయ్‌కుమార్‌ కొత్తగూడెంలోని క్యాంప్‌ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఉత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్‌ రాజును కలిసి కోరినట్లు ఈఓ తెలిపారు. పద్మనాభశర్మ, దుర్గప్రసాద్‌శర్మ, నర్సింహారావు, సాయిరాం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

10 నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

అశ్వారావుపేటరూరల్‌: ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శనివారం క్యాంప్‌ కార్యాలయంలో క్రీడా పోటీలపై క్రీడా కమిటీ, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులకు తాగునీరు, విద్యుత్‌, భద్రత, వైద్య సదుపాయాలు, వాహనాల పార్కింగ్‌ సదుపాయం కల్పించాలన్నారు. అనంతరం స్థానిక కోతమిషన్‌ బజార్‌లో మున్సిపాలిటీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జూపల్లి రమేష్‌బాబు, ఆత్మ కమిటీ చైర్మన్‌ వీరభద్రరావు, కాంగ్రెస్‌ నాయకులు సత్యనారాయణ, కోలా లక్ష్మీనారాయణ, కరీం, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement