పర్యాటకానికి అదనపు ఆకర్షణ
ఆదాయం, ఉపాధి
ప్రతిపాదనలు పంపాం
● గతేడాది జనవరిలో జిల్లాలో పర్యటించిన నిపుణుల బృందం ● హరిత హోటల్, కార్తీక వనం పరిసరాల్లో అటవీ ప్రాంత పరిశీలన ● ఆ తర్వాత ముందుకు సాగని జంతుప్రదర్శనశాల ఏర్పాటు ప్రక్రియ
నేడు ప్రపంచ జంతువుల దినోత్సవం
చుంచుపల్లి/పాల్వంచరూరల్: అడవులు, వన్యప్రాణులు, పర్యాటక ప్రాంతాలకు నెలవుగా ఉన్నా జిల్లాలో జూపార్క్ ఏర్పాటు కార్యరూపం దాల్చడంలేదు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులో గతేడాది జనవరి 7న కేంద్ర జూ ప్రాధికార సంస్థ నిపుణుల బృందం పర్యటించింది. హరిత హోటల్ వెనుక సుమారు 260 ఎకరాలు, సింగరేణి అతిథిగృహం పక్కన కార్తీకవనం పరిసరాల్లో మరో 225 ఎకరాల అటవీ భూమిని పరిశీలించి జూపార్క్ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై అధ్యయనం చేసింది. రెండు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని అప్పట్లో అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు. జిల్లా అటవీశాఖ కూడా ప్రతిపాదనలు సమర్పించింది. దాదాపు 400 రకాల జంతువులు, పక్షులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించాలని భావించారు. అయితే స్థల పరిశీలన తర్వాత అడుగు ముందుకు పడటంలేదు.
అనుకూలతపై సందేహాలు
నిపుణుల బృందం పరిశీలించిన ప్రాంతాలు జూ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా లేవన్న అభిప్రాయాలు తాజాగా వినిపిస్తున్నాయి. భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతుల కల్పన, జంతువుల సంరక్షణకు అవసరమైన వాతావరణం, నీటి వనరులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరంగల్ జిల్లాలో జూపార్క్ ఏర్పాటుకు అనుమతులు రావడం కూడా ఇక్కడి ప్రతిపాదనలపై ప్రభావం చూపినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో జూ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉండటంతో కొత్తగా మరో ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు, సాంకేతిక ఆమోదాలు పొందడం అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు ఉన్న అట వీ విస్తీర్ణం, పర్యాటక ప్రాధాన్యత దృష్ట్యా జూపార్క్ అవసరాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
భద్రాచలం, కిన్నెరసాని ప్రాంతాలతో జిల్లాకు ఇప్పటికే పర్యాటక గుర్తింపు ఉంది. కిన్నెరసానిలో జింకల పార్క్ ఉన్నా వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులను ఒకేచోట చూసే అవకాశం జిల్లావాసులకు లేదు. జూపార్క్ ఏర్పాటైతే పర్యాటకులకు మరో ఆకర్షణగా మారడంతో పాటు పిల్లలు, విద్యార్థులకు జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుంది.
జిల్లాలో గతంలో వందల ఎకరాల విస్తీర్ణంలో అర్బ న్ పార్కులు ఏర్పాటు చేశారు. కానీ జూ పార్కు ఏర్పాటుపై దృష్టి సారించడంలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం మినీ జూపార్కు కూడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది. కిన్నెరసాని అభయారణ్యం, గోదావరి పరీ వాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్ర బిందువులుగా ఉన్నాయి. అధికంగా గిరిజనులు కూడా ఇక్కడే ఉన్నారు. కిన్నెరసానిని అభయారణ్యంగా కేంద్రంగా 1977 జనవరిలో గుర్తించారు. 50 ఏళ్ల క్రితం జింకల పార్కు ఏర్పాటు చేశారు. ఇక్కడి అటవీ ప్రాంతంలో జింకలు, చిరుతలు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, కుందేళ్లు మూషిక జింకలు, అడవి దున్నలు వంటి జంతువులు ఉన్నాయి. దీంతో నిత్యం పర్యాటకులు సందర్శించి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జూ పార్కు ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం, స్థానికులకు ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది.
జూపార్కు ఏర్పాటు కోసం గతేడాది ప్రతిపాదనలు పంపాం. అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ అనుమతికోసం ప్రయత్నం చేశారు. జూపార్కు ఏర్పాటు నిబంధనలు కఠినంగా ఉన్నందున్న మినీ జూపార్కు ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిన్నెరసాని ప్రాంతంలో అనుమతులు సులభంగా లభించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. సఫారీ కోసం మరో డీర్‌పార్కును ఏర్పాటుకు స్థలాన్ని కూడా గుర్తించాం.
–సిద్ధార్థ విక్రమ్ సింగ్,
జిల్లా అటవీశాఖ అధికారి


