అశ్వారావుపేటరూరల్: ఎల్‌నినో నేపథ్యంలో రైతులు యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వేల్పుల బాబూరావు సూచించారు. శనివారం మండలంలోని నారాయణపురం రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంటల సాగుపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, యాసంగి సీజన్‌లో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలైన అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాల పంటలను సాగు చేయాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు సబ్సిడీపై అందిస్తామని, నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామ శివారులో రైతులు సాగు చేస్తున్న అపరాల సాగు క్షేత్రాలను సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, సొసైటీ చైర్మన్ నిర్మల పుల్లారావు, ఏడీఏ పీ రవి, ఏవో పర్సా శ్రీనివాసరావు, ఏఈవోలు షాకిరా భాను, సతీష్, రవీంద్ర, రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి
బాబూరావు


