ఆరోగ్యం, అభివృద్ధే లక్ష్యం
యువకుడి మృతితో కదిలిన పల్లె
మద్యపాన నిషేధానికి గ్రామసభలో తీర్మానం
ఆదర్శంగా నిలిచిన ఆమెర్ద పంచాయతీ ప్రజలు
యువత, మహిళల విజ్ఞప్తితో..
అశ్వాపురం: మండల పరిధిలోని అమెర్ద గ్రామంలో ఓ యువకుడు మద్యానికి బానిసై చిన్న వయసులోనే మృతి చెందాడు. మరో యువకుడు మద్యానికి బానిస కాగా కుటుంబసభ్యులు మందలించా రు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలు గ్రామస్తులను తీవ్రంగా కలచివేశాయి. దీంతో యువత, మహిళలు, గ్రామ పెద్దల్లో మద్యపానం వల్ల నష్టాలపై చైతన్యం పెరిగింది. మద్యం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామాన్ని మద్యరహితంగా తీర్చిదిద్దాలని నడుంబిగించారు.
గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం
గ్రామంలో మద్యం వల్ల జరుగుతున్న నష్టాలు, ప్రజల ఇబ్బందులు, మద్యపాన నిషేధంపై యు వత, మహిళలు, గ్రామస్తులు సర్పంచ్ కొర్సా కృష్ణ, ఉపసర్పంచ్ మేకల అంజిబాబు, గ్రామపెద్దల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈనెల 2న గాంధీ జయంతి సందర్భంగా జరిగిన గ్రామసభలో మద్యపాన నిషేధంపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం విక్రయించినా, మద్యం తాగినా కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.
మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలతోపాటు కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, యువత భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. యువత మద్యానికి దూరంగా ఉండటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటున్నారు. మహిళా సంఘాలు, యువజన సంఘాలు, గ్రామ పెద్దలు సమన్వయంతో మద్యపాన వ్యసనాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఓ యువకుడి మృతి, మరో యువకుడు ఆత్మహత్యాయత్నం వంటి విషా ద ఘటనలు ఇతర కుటుంబాల్లో జరగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలి పారు. గ్రామంలో ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గ్రామసభ తీర్మానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని యువత, మహిళలు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామంలో మద్యం వల్ల జరుగుతున్న నష్టాలను యువకులు, మహిళలు, గ్రామస్తులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామపెద్దల సహకారంతో గ్రామసభలో మద్యపాన నిషేధంపై తీర్మానం చేశాం. తీర్మానం అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. గ్రామం ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూస్తాం.
–కొర్సా కృష్ణ, సర్పంచ్, అమెర్ద గ్రామ పంచాయతీ


